30 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

ప్రచారంలో వెనకబడుతోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

తెలంగాణలో దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. కేసీఆర్‌పాలనను మరిపించేలా పరిపాలన సాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాలను ఇప్పటికే అమలులోకి తెచ్చింది. అయితే, తెలంగాణలో హస్తం పార్టీకి ఆశించిన మైలేజీ రావడం లేదు.

వాస్తవానికి రుణమాఫీ, కొత్త రేషన్‌కార్డుల జారీతో మంచి మైలేజీ వస్తుందని కాంగ్రెస్‌ నేతలు భావించారు. కానీ, ప్రచారంలో ఆ పార్టీ నేతలే వెనుకబడి పోతున్నారు. అంతర్గత కుమ్ములాటలు, అలకల కారణంగా చేసిన పని చెప్పుకోలేకపోతున్నామని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కలిసి కట్టుగా ప్రభుత్వం చేసే పనులను ప్రజలకు చెప్పాలని పెద్దలు కోరుతున్నారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇదే పని చేస్తున్నారు. అయినా.. తాము ఇస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నేతలు విఫలం అవుతున్నారు.

మరోవైపు.. సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీపై విపక్షాలు విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీ అనేక వియాల్లో కాంగ్రెస్‌ పాలనను తప్పు పడుతున్నాయి. హామీలు అమలు చేయలేదని ఎత్తి చూపుతున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి నెలనెలా ఢిల్లీకి వెళ్లడాన్ని హైలెట్‌ చేస్తున్నాయి. సోషల్‌ మీడియా ప్రభావంతో ప్రజలు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న భావనలోనే ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల సోషల్‌ మీడియా ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా విఫలమవుతోంది. మరోవైపు.. తాము అమలు చేస్తున్న పథకాలను కూడా సోషల్‌ మీడియా వేదికగా పెద్దగా ప్రచారం చేసుకోలేక పోతున్నారు. మంచైనా, చెడైనా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తేనే క్షేత్రస్థాయికి చేరుతుందనేది ప్రస్తుత స్మార్ట్‌ యుగంలో అందరూ చెబుతున్న మాట. చెప్పడమే కాదు.. ఇదే వాస్తవం. దీనిని గుర్తించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతం చేస్తోంది. బలంగా గ్రౌండ్‌ లెవల్‌కు తీసుకెళ్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కొన్ని మంచి పనులు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, రైతు రుణమాఫీ వంటివి అమలు చేస్తోంది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ గేమ్‌ చేంజర్‌ పథకాలు. కానీ, వీటిని కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యూహాత్మక తప్పిదమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉచిత ప్రయాణంతో నెలకు సుమారు రూ.3 కోట్ల రూపాయలు మహిళలకు మిగులుతున్నాయి. ప్రభుత్వం మీద భారం పడుతోంది. దీనిని ప్రచారం చేసుకోవడం లేదు. క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం లేదు. ఇక రుణమాఫీతో లక్షల మంది రైతులకు కోట్లాది రూపాయల లబ్ధి కలిగింది. పదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా సాధ్యం కానిది.. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చాక నెరవేరింది. కానీ, దీనిని కూడా సరిగా ప్రచారం చేసుకోలేకపోతోంది. రూ.500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ కారణంగా కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు భారీగా లబ్ధి కలుగుతోంది. దీనిని లెక్కలతో సహా వివరించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఈ కారణంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో తీవ్రంగా వెనుకబడిపోతోంది.

ఇదిలా ఉంటే టీపీసీసీ రాష్ట్రంలో క్యాడర్‌ను యాక్టివ్‌ చేయడంలో విఫలమవుతోంది. బీఆర్‌ఎస్‌ ఏ కార్యక్రమం చేసినా.. క్షేత్రస్థాయిలో సంబరాలు నిర్వహించేది. ఇప్పటికీ ప్రతిపక్షంగా కూడా అదే చేస్తోంది. కానీ, కాంగ్రెస్‌ పార్టీ ఈ మేరకు కార్యక్రమాలు కూడా కిందిస్థాయిలో నిర్వహించడం లేదు. ఎమ్మెల్యేలు, టీపీసీసీ కూడా ఈమేరకు యాక్టివ్‌ చేయడం లేదన్న వాదనలున్నాయి. పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవుల భర్తీలో జాప్యం కూడా క్యాడర్‌లో నిస్తేజానికి కారణమంటున్నారు. మరోవైపు.. పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడం కూడా కేడర్‌లో యాక్టివ్‌నెస్‌ కొరవడిందంటున్నారు. ఇప్పటికైనా టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి తమ ప్రభుత్వానికి మైలేజీ రావడంలో ఎక్కడ లోపం జరుగుతుందో గుర్తిస్తారా, లేదా అన్నది చూడాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com