పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనుల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పాలమూరు జిల్లాకు త్రాగు, సాగు నీరు అందించడానికి కృష్ణా నదిలో ఉన్న ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి ఎంత ఖర్చు చేయడానికి అయినా ప్రజా ప్రభుత్వం వెనుకాడదని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నాగర్ కర్నూరు జిల్లా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు. తరువాత బిజినపల్లి మండలం పాలెం గ్రామ శివారులో మార్కండేయ పంప్ హౌజ్ ఎత్తిపోతల పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు. అనంతరం బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీని తరువాత తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు నాగర్ కర్నూలు జిల్లా సిరిపురం గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.