నాగర్ కర్నూల్ సభలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీయం
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి కాంగ్రెస్ శ్రేణులు తీసుకువెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కె.రాజేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ జనసభ కార్యక్రమంలో భట్టి విక్రమార్క ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ స్వీప్ క్లీన్ చేయాలని అభిలషించారు. ప్రజా పాలనలో మీరందరూ భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 26 నుంచి పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. 48 లక్షల కుటుంబాలకు ఉచితంగా గృహ విద్యుత్ అందిస్తున్నామని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో 28 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు ఉచిత విద్యుత్తును అందించి ఏటా 12 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తోందన్నారు. 22,500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం చేయబోతున్నాం. ప్రతి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసా కు 8400 కోట్ల రూపాయలకు పైబడి వెచ్చిస్తున్నామని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా నిరుపేద కూలీలకు ఏటా 12 వేల రూపాయలు ఇవ్వడానికి 2వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు 66 వేల కోట్ల రూపాయల అప్పు మరియు వడ్డీలు చెల్లించామన్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పినట్టుగానే 22 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. గురుకుల హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి 40 శాతం డైట్ చార్జీలు, 200% కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. ఇక ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడమే కాకుండా వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు.