- ముగ్గురు జడ్జిల ఇన్ హౌస్ కమిటీ దర్యాప్తు
- యశ్వంత్ వర్మను విచారించనున్న బృందం
- ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో నోట్లకట్టలు
- హోలీ రోజు అగ్ని ప్రమాదంతో వెలుగు లోకి
- ముందు పనిష్మెంట్ బదిలీతో సరిపెట్టిన కొలీజియం
- అలహాబాద్ హై కోర్టు బార్ అసోసియేషన్ అభ్యంతరం
- దాంతో విచారణకు నిర్ణయించిన సుప్రీంకోర్టు
ఇది న్యాయ శాఖను కదిపేస్తున్న పరిణామం. కోర్టు కేసుల్లో మంచి చెడులను సాక్ష్యాల ఆధారంగా తీర్పు చెప్పే న్యాయవాదుల వర్గంలో కల్లోలం రేపుతున్న అంశం. హోలీ రోజు ఢిల్లీలో హై కోర్టు జడ్జి యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల నార్పుతున్న సమయంలో ఓ గదిలో నోట్ల కట్టలు కుప్పలు కుప్పలుగా వెలుగు చూశాయి. మొదట్లో ఈ వార్త పైకి రాకపోయినా ఆనోటా ఆనోట పాకి మొత్తానికి బయట పడింది.దీంతో న్యాయవాదవర్గాల్లో కలకలం రేగింది. చివరకు విషయం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ముందుకొచ్చింది. దాంతో ఢిల్లీ హై కోర్టు జడ్జి ని మరో హై కోర్టుకు బదిలీ చేశారు.
జడ్జి లేని సమయంలో ఘటన
అగ్నిప్రమాదం జరిగినప్పుడు యశ్వంత్ వర్మ ఊళ్లో లేరు. దాంతో కుటుంబ సభ్యులు అగ్ని ప్రమాద కార్యాలయానికి ఫోన్ చేశారు. వారొచ్చి మంటలు ఆర్పేయగానే ఒక గదిలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. అక్కడ నోట్లకట్టలు ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సైతం తెలియదు. అయితే గుట్టలుగా అంత పెద్ద సొమ్ము అనధికారికంగా కనపడటంతో వాటిని అధికారికంగా ఎంట్రీ చేయాల్సి వచ్చింది. దాంతో విషయం అంతా బయటకొచ్చింది. నోట్ల కట్టలు చూసిన పోలీసులు ఆ విషయం సీనియర్ అధికారులకు చెప్పడంతో ఈ వార్త దావానలంలా మారింది.విషయం సప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి రావడంతో ఆయన కొలీజియం వెంటనే సమావేశమైంది. అయితే హై కోర్టు జడ్జి యశ్వంత్ వర్మను మళ్లీ పనిష్మెంట్ బదిలీ కింద వెనక్కు పంపాలని తీర్మానించడంతో ఆయన్ను మళ్లి అలహాబాద్ హై కోర్టుకు బదిలీ చేశారు.
మేమేమైనా డస్ట్ బిన్ఆ?
ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జిని పనిష్మెంట్ ట్రాన్స్ ఫర్ కింద వెనక్కు పంపండంపై అటు అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా రియాక్టయ్యింది. ఆయన్ను వెనక్కు పంపడం ఏంటి?మేమేమైనా డస్ట్ బిన్ లు లా (చెత్తకుండీల్లా) కనిపిస్తున్నామా? అంటూ సుప్రీంకోర్టు కొలీజియం కు లేఖ రాసింది.
ఈపరిణామంతో కొలీజియంలో కొందరు పెద్దలు కంగు తిన్నారు. నిజమే కదా?అనే మథనం మొదలైంది. కొలీజియంలో ఉన్న ఐదుగురు బదిలీ శిక్షతో సరిపెడితే న్యాయవ్యవస్థమీద నమ్మకం ఉండదని ఇంకా కఠినమైన నిర్ణయం వెలువడాలని అభిప్రాయపడ్డారు. యశ్వంత్వర్మను తక్షణం రాజీనామా చేయమని ఆదేశించాలని, ఆయన నిరాకరిస్తే వెంటనే ఇన్ హౌస్ ఎంక్వయిరీ వేయాలని సూచించారు. పార్లమెంటు ద్వారా అభిశంసించి తొలగించడంలో ఇది మొదటి మెట్టని వారన్నారు.దాంతో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇన్ హౌస్ కమిటీతో దర్యాప్తుకు ఆదేశించారు.
ఇన్ హౌస్ ఎంక్వయిరీ ప్రొసీజర్ ఇలా
1999లో సుప్రీంకోర్టు నిర్ణయించిన విధానం ప్రకారం అవినీతి, లేదా తప్పు, లేదా అభిశంసన ఆరోపణలను ఎదుర్కొంటున్న జడ్జి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది సంతృప్తి కరంగా లేకపోతే ఒక సుప్రీం కోర్టు జడ్జి, మరో ఇద్దరు హైకోర్టు చీఫ్ జస్టిస్ ల ఆధ్వర్యంలో కూడిన బెంచ్ ఇన్ హౌస్ విచారణ జరుపుతుంది.
కొలీజియం తడబాటు
సాధారణంగా ఆదాయానికి మించి ఆస్తులు, అనధికారికంగా లెక్కా పత్రం లేకుండా సొమ్ము కలిగి ఉంటే సీబిఐ,ఈడీ,ఐటి అధికారులు దాడులు చేస్తారు. కేసులు బుక్ చేస్తారు. సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసులు పెడతారు. కోర్టుల చుట్టూ తిప్పుతారు. కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా పంపిస్తారు. రాజకీయవేత్తలు, వ్యాపార వేత్తలు, సంపన్న వర్గాలకు చెందిన వారి పైనా ప్రభుత్వ వైఖరి అలా వుంటుంది. కేసు మీద కేసు పెట్టేసి ఊపిరి సలపకుండా నలిపేస్తుంటారు. కానీ న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి విచారణ జరిపి నిష్పాక్షిక తీర్పులివ్వాల్సిన ఒక జడ్జి గారింట్లోనే లెక్కా పత్రం లేని నోట్ల కట్టల గుట్టలు కనిపిస్తే దానిపై పోలీసులు, ప్రభుత్వ వర్గాల చర్యలు మాత్రం తూతూ మంత్రంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కళ్ల ముందే లెక్కా పత్రం లేని సొమ్ము గుట్టలుగా కనిపిస్తే నేరుగా చర్యలు తీసుకోవాల్సింది పోయి జడ్జిల్లోనే అంతర్మథనం జరిగి అలహాబాద్ హై కోర్టు బార్ అసోసియేషన్ అభ్యంతరం తెలిపాక కొలీజియం ఇన్ హౌస్ కమిటీ ఎంక్వయిరీకి ఆదేశించక తప్పలేదు.