29.7 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

బోర్డర్‌లో ఉద్రిక్తతల వేళ యూపీలో డిఫెన్స్‌ కారిడార్‌

భారత్‌–పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత దేశం సైనిక సామర్థ్యాలను మరింత మెరుగు పరిచుకునే దిశగా.. బలోపేత చేసుకునే దిశగా కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, యూపీ డిఫెన్స్‌ కారిడార్‌లోని ఆరు నోడ్‌లలో ఒకటిగా, బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి తయారీ కేంద్రాన్ని స్థాపించింది. 300 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ యూనిట్‌ను అధికారికంగా ప్రారంభించారు. బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ నేతృత్వంలో ఈ యూనిట్‌ ఏర్పాటు చేశారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలన్న భారత్‌ టార్గెట్‌కు ఈ యూనిట్‌ ప్రారంభం ఒక సంచలనాత్మక ముందడుగుగా భావిస్తున్నారు. లక్నోలోని ఈ బ్రహ్మోస్‌ తయారీ యూనిట్‌ నిర్మాణం మూడున్నర సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేశారు. ఇది యూపీ సర్కారుతో పాటు.. బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సమన్వయం, సమర్థతకు నిదర్శనమని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌వేస్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ ప్రాజెక్ట్‌ కోసం 2021 డిసెంబర్‌లో 80 హెక్టార్ల భూమిని ఉచితంగా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ.. రికార్డు సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేసింది. బ్రహ్మోస్‌ క్షిపణులే కాకుండా.. ఇతర రక్షణ పరికరాల తయారీకి కూడా ఈ యూనిట్ వేదికగా మారనుంది. లక్నోను రక్షణ సంబంధిత ఉత్పత్తుల తయారీ రంగంలో ఓ కీలకమైన సెంటర్‌గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

బ్రహ్మోస్‌ క్షిపణి భారత్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌తో పాటు.. రష్యాకు చెందిన ఎన్‌పీవో మాషినోస్ట్రోయెని సంయుక్త సహకారంతో రూపొందించిన అత్యంత శక్తివంతమైన సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి. ఈ జాయింట్‌ వెంచర్‌లో భారత్‌ 50.5%, రష్యా 49.5% వాటాను కలిగి ఉన్నాయి. ఇది భారత ప్రభుత్వం విదేశీ ప్రభుత్వంతో చేపట్టిన తొలి రక్షణ సహకార సంస్థగా నిలిచింది. ‘బ్రహ్మోస్‌’ పేరు భారత్‌ యొక్క బ్రహ్మపుత్ర నది (బలం), రష్యా మోస్క్వా నది (శాంతి) నుంచి ఉద్భవించింది. 290–400 కిలోమీటర్ల పరిధి, మ్యాక్‌ 2.8 వేగం, 200–300 కిలోల వార్‌హెడ్‌తో, బ్రహ్మోస్‌ శత్రు రక్షణ వ్యవస్థలను ఛేదించగల సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్షిపణులలో ఒకటిగా పరిగణించబడుతోంది. భారత్‌–పాకిస్థాన్‌ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, లక్నోలో బ్రహ్మోస్‌ యూనిట్‌ స్థాపన భారత్‌ జాతీయ భద్రతను బలోపేతం చేసే కీలక చర్యగా చెబుతున్నారు. ఈ యూనిట్‌ బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీని వేగవంతం చేయడం ద్వారా భారత సైన్యం సన్నద్ధతను కూడా మరింత పటిష్ఠం చేస్తుంది. అదనంగా, ఈ ప్రాజెక్ట్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి కూడా ఊతం ఇస్తుంది. ఈ యూనిట్‌ సుమారు 500 మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది, అలాగే వేలాది మంది నైపుణ్యం కలిగిన, సాధారణ కార్మికులకు పరోక్ష ఉపాధిని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ యూపీలో ఏరోస్పేస్‌ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి, ఆధునిక తయారీ సాంకేతికతలను రాష్ట్రంలోకి తీసుకురావడానికి దోహదపడుతుందని యూపీ ప్రభుత్వ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లక్నోలోని బ్రహ్మోస్‌ యూనిట్‌ ఉత్తరప్రదేశ్‌లో అధునాతన రక్షణ తయారీ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ యూనిట్‌ రాష్ట్రంలో ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమలకు కొత్త ఊపును అందిస్తుందని అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థలకు సాంకేతిక అభివృద్ధి, వ్యాపార అవకాశాలను కూడా సృష్టించనుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా యూపీ డిఫెన్స్‌ కారిడార్‌ భారత్‌ రక్షణ తయారీ రంగంలో కీలక కేంద్రంగా రూపొందుతోంది, ఇది జాతీయ భద్రత, ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com