భారతదేశానికి మద్దతుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఎ) సంచలన ప్రకటన చేసింది. భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో.. బీఎల్‌ఎ తన వైఖరిని స్పష్టం చేసింది. భారత్‌పై పూర్తి మద్దతు ప్రకటించిన బీఎల్‌ఎ, పాకిస్తాన్‌పై దాడి చేయాలని విజ్ఞప్తి చేసింది. పశ్చిమ సరిహద్దు నుండి భారత్‌కు సైనిక మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే, తమవంతుగా పాక్‌పై దాడి చేస్తామని వెల్లడించింది. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని కోరుతూ, భారత్ చర్యలను స్వాగతిస్తున్నామని తెలిపింది.
పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బీఎల్‌ఎ, ఆదివారం భారత ప్రభుత్వానికి లేఖ రాసి పాక్‌పై దాడి చేయాలని అభ్యర్థించింది. భారత్ ఒక అడుగు ముందుకు వేయాలని, పశ్చిమ దేశాల మద్దతుతో పాక్‌ను నిర్మూలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. బీఎల్‌ఎ ఏ దేశానికీ కీలుబొమ్మ కాదని, ఈ ప్రాంతంలోని సైనిక, రాజకీయ సమీకరణాలలో తాము ఓ కీలక శక్తిగా ఎదిగామని పేర్కొంది.
పాకిస్తాన్ శాంతి ప్రకటనలు మోసపూరితమైనవని బీఎల్‌ఎ ఆ లేఖలో పేర్కొంది. పాక్ మాటలు నమ్మొద్దని, భారత్‌తో పాటు ఇతర ప్రాంతీయ శక్తులు తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందని ఆరోపించింది. బాహ్య మద్దతు లేకుండానే బలూచిస్తాన్ గడ్డపై పాక్‌ను అనేక రంగాల్లో ఓడించామని తెలిపింది.
పాకిస్తాన్‌ను మూలాల నుంచి నిర్మూలించేందుకు భారత్ రాజకీయ, దౌత్య, సైనిక మద్దతు ఇవ్వాలని బీఎల్‌ఎ విజ్ఞప్తి చేసింది. పాక్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, అస్థిరత కొనసాగుతుందని హెచ్చరించింది. భారత్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటే, తాము పశ్చిమ సరిహద్దు నుండి మద్దతుగా నిలుస్తామని మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలు ఈ అవకాశాన్ని గుర్తించకపోతే, బలూచ్ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని పేర్కొంది. శాశ్వత శాంతి, సమతుల్యత, ఉగ్రవాద నిర్మూలనకు స్వతంత్ర బలూచిస్తాన్ అవసరమని బీఎల్‌ఎ అభిప్రాయపడింది.