భారత్–పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ, భద్రతాపరంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ యుద్ధం నేపథ్యంలో పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పాక్‌కు చెందిన హ్యాకర్లు భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియా వేదికగా సైబర్ దాడులకు పాల్పడుతున్నారని, ప్రత్యేకించి ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ అనే మాల్వేర్‌ను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మాల్వేర్ వీడియోలు లేదా డాక్యుమెంట్ ఫార్మాట్‌లో లింకులుగా పంపబడుతుందని, అవి ఓపెన్ చేసిన వెంటనే మొబైల్స్, కంప్యూటర్లపై నియంత్రణ శత్రుపక్షానికి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ దాడుల వెనుక వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా దోచుకునే ఉద్దేశం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
సైబర్ ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పద ఫైల్స్, లింకులు, అటాచ్‌మెంట్స్‌ను ఓపెన్ చేయవద్దని, ముఖ్యంగా డాట్ ఏపీకే, డాట్ ఇఎక్స్‌ఇ ఫైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్‌లలో తెలియని నెంబర్ల నుంచి వచ్చే లింకులను అస్సలు క్లిక్ చేయొద్దని, అలాగే తెలిసిన వారివద్ద నుంచి వచ్చిన ఫార్వార్డ్ లింకులకైనా సరే నేరుగా ఓపెన్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. అలాంటి లింకులను మళ్లీ ఇతరులకు పంపితే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఏపీకే ఫైల్స్‌ను మెసేజింగ్ యాప్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే ప్రమాదకరమని ఎప్పుడైనా అవసరం ఉంటే మాత్రం గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక యాప్ స్టోర్ల నుంచే యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలని సూచిస్తున్నారు. ఓటీపీలను ఎవరికీ షేర్ చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యే సెట్టింగ్ ను ఆఫ్‌లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి లింకులు, మెస్సేజ్‌లపై అనుమానం ఉంటే.. వాటిని “cybercrime.gov.in” వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.