తెలంగాణలో ఇటీవల కొత్తగా ఎమ్మెల్సీగా నియామకమైన దాసోజు శ్రవణ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనమండలి చైర్మన్ ఛాంబర్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఎరడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇటీవలే కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఒకరు, టీచర్ల నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఒకరు, ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు ఈనెల 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే, బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన శ్రవణ్ కుమార్ మాత్రం ఆరోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇవాళ మండలి చైర్మన్ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, మల్లారెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.