24.3 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

భారత సైన్యం పేరుతో సైబర్ మోసాలు

జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని సైబర్ నేరగాళ్లు తమ లాభానికి వాడుకోవాలని చూస్తున్నారు. దేశభక్తిని అసత్య ప్రచారాలకు ఆయుధంగా మలుచుకుంటూ, సామాన్య ప్రజలను మోసం చేయడానికి వారు నకిలీ సందేశాలను సోషల్ మీడియా ద్వారా పంచుతున్నారు.

ఇటీవల వాట్సాప్‌లో ఒక సందేశం వైరల్ అవుతోంది. అందులో, కేంద్ర ప్రభుత్వం భారత సైన్యం కోసం ప్రత్యేకంగా ఓ బ్యాంకు ఖాతా తెరిచిందని, ప్రజలు తమ దేశభక్తిని చాటేందుకు ఆ ఖాతాకు నేరుగా డబ్బులు జమ చేయవచ్చని పేర్కొన్నారు. “కనీసం ఒక్క రూపాయి అయినా జమ చేస్తే దేశభక్తిని ప్రదర్శించినట్లే” అనే ఆకర్షణీయమైన వాక్యాలతో ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయుధాల కొనుగోలుకు కూడా ఈ డబ్బు వాడుతామనే మాటలు కూడా ఆ సందేశంలో ఉన్నాయి.

ఈ వదంతుల వెనుక ఉన్న అసలైన నిజాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వార్తలు పూర్తిగా నకిలీవని పేర్కొంది. తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, సోషల్ మీడియాలో ఈ తరహా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, ప్రజలు అవి నమ్మరాదని హెచ్చరించింది.

ఈ నకిలీ ప్రచారంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పేరు కూడా ఉపయోగించారు. ఈ ప్రతిపాదనకు అక్షయ్ కుమార్ ప్రధాన ప్రమోటర్‌గా ఉన్నట్లుగా చూపుతూ, ఆయన పేరును దుర్వినియోగం చేశారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని, ఆయనకు ఇందుతో ఎలాంటి సంబంధం లేదని PIB ఖండించింది.

ఇలాంటి మోసాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు కూడా స్పందించారు. ఈ తరహా తప్పుడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసినా లేదా డబ్బు పంపమంటూ సంప్రదించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రస్తుతం దేశంలో సంభవిస్తున్న ఉద్విగ్న పరిస్థితులను దుర్వినియోగం చేయడానికి సైబర్ నేరగాళ్లు పక్కా ప్రణాళికలతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వారి ఎత్తుగడలకు లోనవ్వకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com