ఆంధ్రప్రదేశ్ రాజధాని పనుల పున: ప్రారంభోత్సవానికి ముహుర్తం సమీపిస్తుండంటంతో అతిథులకు ఆహ్వాన పత్రికలను జిఏడి సిద్ధం చేసింది. అమరావతి ప్రజా రాజధాని పున: ప్రారంభం ఆహ్వాన పత్రికలను రెడీ చేశారు.అమరావతి నగర నిర్మాణ పనుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికల్ని ప్రభుత్వం అతిథులకు పంపుతోంది. అమరావతి ప్రజారాజధాని పున: ప్రారంభం పేరుతో వీటిని రెడీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లతో వీటిని రూపొందించారు. ఆహ్వాన పత్రికలపై అమరావతి స్థూపంతో పాటు అమరావతి డిజైన్లతో రూపొందించారు.ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభంతో పాటు మే 2వ తేదీన ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.మే 2న కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రధాని బయలుదేరుతారు. 2.50 గంటలకు విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు.సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి 3.30 గంటలకు వేదిక వద్దకు వస్తారు. సాయంత్రం 4.45 గంటల వరకు వివిధ కార్యక్ర మాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని పర్యటన గంట 15 నిమిషాల పాటు ఉంటుంది. అనంతరం ఆయన విజయవాడ విమానాశ్రయం చేరుకుని, సాయంత్రం 5.20 గంటలకు ఢిల్లీకి ప్రయాణమవుతారు.
- Advertisement with us -