వాళ్లు ఇద్దరూ మహిళలు.. పైగా ప్రభుత్వ ఉద్యోగినులు. వైద్య ఆరోగ్యశాఖలో మంచి స్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సమాజంలో గౌరవ ప్రదమైన హోదాలో ఉన్నారు. కానీ, వాళ్లిద్దరూ దారి తప్పారు. వ్యసనానికి బానిసయ్యారు. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటయ్యారు. బెట్టింగుల్లో భారీ మొత్తంలో నష్టపోయారు. దాదాపు 30 లక్షల దాకా అప్పులు చేశారు. మరి.. ఆ అప్పుల నుంచి బయట పడేదెలా? నెల నెలా వచ్చే జీతంతో ఆ అప్పులు తీర్చడం, మళ్లీ బెట్టింగ్‌లు కాయడం సాధ్యం కాదు కదా… అందుకే వాళ్లిద్దరూ దిమ్మ దిరిగే ప్లాన్ వేశారు. అప్పులన్నీ తీర్చేయొచ్చనుకున్నారు. కానీ, డామిట్! కథ అడ్డం తిరిగింది. జనం చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. పోలీసుల అధీనంలోకి వెళ్లారు. కటకటాల పాలయ్యారు.
నెల్లూరు జిల్లా కోవూరులో గత కొంత కాలంగా చైన్ స్నాచింగ్‌లు ఎక్కువగా నమోదవుతున్నాయి. పేరు మోసిన దొంగలు గానీ, గతంలో చైన్ స్నాచింగ్‌లలో పట్టుబడ్డ వాళ్లను గానీ విచారించినా లాభం లేకుండా పోతోంది. దీంతో, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే, శుక్రవారం ప్రజలే ఆ చైన్ స్నాచర్లను పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెతకబోయే తీగ కాలికి తగిలిందనుకున్న పోలీసులు.. ఆగ మేఘాలమీద సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ స్థానికులు పట్టుకొని చితక్కొట్టిన వాళ్లు పురుషులు కాదు.. మహిళలు. వాళ్లే చైన్ స్నాచర్లని స్థానికులు చెప్పారు. తొలుత పోలీసులు సందేహించినా అదే నిజమని తేలింది. అయితే, ఆ మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్న సమయంలో పోలీసులకు మైండ్ బ్లాంకయ్యింది. ఆ మహిళలు ఏదో ఆవారాగా తిరిగేవాళ్లు కాదు. సాక్షాత్తూ ప్రభుత్వ ఉద్యోగులు. వైద్య ఆరోగ్య శాఖలో గౌరవ ప్రదమైన ఉద్యోగం చేస్తున్నారు. వ్యసనాలకు బానిసై వచ్చే జీతం సరిపోక.. ఇలా చైన్ స్నాచర్లుగా మారిపోయారు.
కోవూరులో తన మనవరాళ్లను ఓ వృద్ధురాలు ఇంటిబయట ఆడిస్తోంది. అదే సమయంలో ఇద్దరు మహిళలు స్కూటీ మీద అటువైపుగా వచ్చారు. ఓ మహిళ స్కూటీపైనే ఉండగా.. మరో మహిళ స్కూటీ దిగి.. ఆ వృద్ధురాలితో ముందుగా మాటలు కలిపింది. తన వెంట తెచ్చుకున్న కారం ఆమె కళ్లల్లో చల్లి.. వృద్ధురాలి మెడలోని బంగారు చైన్ లాక్కెళ్లారు. అయితే, వృద్ధురాలు పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న వాళ్లంతా క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. స్కూటీపై పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు. క్రికెట్ బెట్టింగులకు బానిసైన ఆ ఇద్దరు మహిళలు బెట్టింగ్‌లలో దాదాపు రూ.30 లక్షల దాకా పోగొట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇలా చైన్ స్నాచర్లుగా మారిపోయారని తేల్చారు.
వ్యసనం అంటేనే మన జీవితాలను నాశనం చేసేది. బెట్టింగ్ భూతానికి బానిసలైతే ఎలా ఉంటుందో ఈ ఇద్దరు మహిళలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సాధారణంగా యువకులు బెట్టింగ్‌లపైకి ఎక్కువగా బానిసలవుతూ ఉంటారు. కొందరు ఉద్యోగులు, మంచి స్థానంలో ఉన్నవాళ్లు కూడా బెట్టింగ్‌లను వ్యసనంగా మార్చుకోవడం కనిపిస్తుంది. కానీ, ఏకంగా మహిళలు.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు, సంఘంలో గౌరవ ప్రదమైన హోదాలో విధులు నిర్వర్తిస్తున్న వాళ్లను కూడా బెట్టింగ్ భూతం ఆవరించింది. వాళ్లను బెట్టింగ్ వ్యసనపరులుగా మార్చింది. అప్పుల పాలు చేసింది. వాళ్లను దొంగలుగా మార్చేసింది. చివరకు జైలు పాలు చేసింది.
చూశారుగా.. బెట్టింగ్‌ల వంటి వ్యసనాల జోలికి వెళ్లొద్దంటూ సామాజిక వేత్తలే కాదు.. పోలీసులు కూడా తరచూ సందేశాలు ఇస్తుండటం చూస్తుంటాం. చాలా మంది బెట్టింగుల బారిన పడి ఆత్మహత్యల దాకా వెళ్తుంటారు. కొంతమంది అప్పుల పాలై ఊళ్లు వదిలి పారిపోతుంటారు. తరచూ ఇలాంటి పరిణామాల గురించిన వార్తలు తెలుసుకుంటూ ఉంటాం. అయితే, ఇప్పుడు ఈ మహిళలు వ్యసనం నుంచి బయట పడలేక చైన్ స్నాచర్లుగా మారిపోయారు.