తెలంగాణలో ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించిన రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎస్ శాంతి కుమారి సమీక్షించారు.
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, అందుకు తగిన విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఇప్పటికే యాభై శాతానికి పైగా సన్నబియ్యం చౌక ధరల దుకాణాలకు వచ్చాయని, మిగిలిన స్టాక్‌ను రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. బియ్యం నాణ్యత, పరిమాణానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు.