కళ్లముందే నిత్యం ఆడుకునే పసిపిల్లలపట్ల ఆ దుర్మార్గుడు కర్కశంగా వ్యవహరించాడు. తల్లిదండ్రులు లేని సమయంలో తన గదిలోకి తీసుకెళ్లి కిరాతకానికి ఒడిగట్టే ప్రయత్నం చేశాడు. ఆ పసివాళ్లు అరవడంతో భయపడి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేశాడు. మహారాష్ట్రలోని పుణె పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. రాజ్‌గురు నగర్‌లో ఈ దుర్మార్గం బయటపడింది.
పుణెకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌గురునగర్‌లో అదృశ్యమైన ఇద్దరు అక్కా చెల్లెళ్ల కథ విషాదాంతమయ్యింది. ఎనిమిదేళ్లు, తొమ్మిదేళ్ల వయసున్న అక్కాచెల్లెళ్ల మృతదేహాలు నీటి డ్రమ్ములో పోలీసులు గుర్తించారు. ఆ కుటుంబం నివసిస్తున్న భవనంపై అంతస్తులోనే విగతజీవులైన అక్కాచెల్లెళ్ల మృతదేహాలు దొరికాయి. వంటవాడిగా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కంత్రీగాడు ఆ గదిలో నివసిస్తున్నాడు. చిన్నారులను చంపేసిన తర్వాత తమ స్వస్థలం పశ్చిమ బెంగాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఆ దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ ఇద్దరు బాలికల తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి రోజుకూలీ. తల్లిదండ్రులు విధులకు వెళ్లిన సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు రోజూ మాదిరిగానే గత బుధవారం ఇంటిముందు ఆడుకుంటున్నారు. అయితే వాళ్లను పై అంతస్తులో ఉండే వంటవాడు దుర్బుద్ధితో లడ్డూలు ఇస్తానంటూ తన గదికి పిలిచాడు. ముందుగా చెల్లెలిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ బాలిక అరవడంతో అక్కడే ఉన్న వాటర్ డ్రమ్ములో తల ముంచి ఊపిరాడకుండా చేశాడు. బాలిక చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె అక్కపైనా అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఆ బాలిక కూడా అరవడంతో ఆమెను కూడా అదే నీటి డ్రమ్ములో ముంచి హత్యచేశాడు. ఆ తర్వాత పుణెకు పారిపోయి ఓ లాడ్జిలో తలదాచుకున్నాడు. తమ స్వస్థలం పశ్చిమబెంగాల్ పారిపోయేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు.. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన ఆ బాలికల తల్లిదండ్రులు వాళ్లకోసం పరిసరాలన్నీ వెతికారు. కూతుళ్లు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. పిల్లలు అదృశ్యమైనప్పటినుంచీ పై అంతస్తులో ఉండే వంటవాడు కనిపించడం లేదని తెలుసుకున్నాడు. వాడిగురించి ఆరాతీస్తూ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేసి పుణెలోని లాడ్జీలో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో జరిగిన కిరాతకాన్ని మొత్తం పోలీసులకు చెప్పేశాడు. కళ్లముందే తిరిగే ఇద్దరు పిల్లలను పొట్టనబెట్టుకున్న ఆ దుర్మార్గుడిపై తల్లిదండ్రులు శాపనార్థాలు పెడుతున్నారు. తమ కంటిపాపలు ఇక తిరిగి రారని తెలిసి గుండెలు బాదుకుంటున్నారు.