- కాంగ్రెస్ పార్టీలో వివాదం అవుతున్న ఎమ్మెల్యేల తీరు
- పార్టీని, ప్రభుత్వాన్ని డామేజ్ చేస్తున్న ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
- ఎన్నిసార్లు మందలించినా తీరు మార్చుకోని శాసనసభ్యులు
- నోరు పారేసుకుంటున్న శాసనసభ్యులకు రేవంత్ క్లాస్
- ఎంపీ చామాల కిరణ్ కు సీఎం వార్నింగ్.
- మరి కొంతమంది ఎమ్మెల్యేలకు గట్టి క్లాస్
అటు కాంగ్రెస్ పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రివర్గ విస్తరణ నుంచి మొదలుకొని అనేక అంశాలపై తమకు సంబంధం ఉన్నా లేకున్నా కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనలు పార్టీకి ప్రభుత్వానికి సమస్యగా మారుతున్నాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో స్వయంగా రేవంత్ రెడ్డి పేర్లు పెట్టి కొంతమంది నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.
ఇంతకీ రేవంత్ రెడ్డి చెప్పిన ఎమ్మెల్యేలు ఎవరన్నది ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధానంగా ప్రతిరోజు మీడియాలో ఏదో విధంగా మాట్లాడుతున్న వ్యక్తుల్లో ప్రముఖంగా వినిపిస్తున్న వాటిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్, గడ్డం వినోద్, మల్ రెడ్డి రంగారెడ్డిల పేర్లు ఉన్నాయి. ఇందులో ఒక అడుగు ముందుకేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా తమ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి అడ్డుపడుతున్నారని బహిరంగ సభలోనే తన అక్కసు వెళ్లగక్కారు. నిజానికి ఇది మొదటిసారి కాదు రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రివర్గంలో సీటు గ్యారంటీ అని హోం శాఖను తనకు కేటాయిస్తారని పదేపదే ఎక్కడ అవకాశం ఉన్న అక్కడ ప్రకటనలు చేస్తూ వచ్చారు. విలేకరులతో ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిందని చెప్పుకునే వారు. అయితే రాజగోపాల్ రెడ్డి లూజ్ టాక్ వల్ల అనేక సమస్యలు వచ్చినట్లుగా సీనియర్ నేతలు అంగీకరిస్తున్నారు. ఇక గడ్డం వినోద్ ప్రేమ్ సాగర్ రావుల మధ్య చాలా రోజుల నుంచి మంత్రివర్గానికి సంబంధించి మాటలు యుద్ధం జరుగుతోంది. గడ్డం వివేక్ కు క్యాబినెట్లో సీటు గ్యారంటీ అయ్యిందంటూ ప్రచారం జరిగిన వెంటనే ప్రేమ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. తమ కుటుంబాన్ని ఉద్దేశించి ప్రేమ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలకు గడ్డం వినోద్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇక మరో ఎమ్మెల్యే విషయానికి వస్తే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తనకు క్యాబినెట్లో అవకాశం కల్పించాలని చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే్లో రంగారెడ్డి ప్రధమ స్ధానంలో ఉంటారు. తనకు అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని కూడా ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే కాంగ్రెస్ పెద్దలను బెదిరించారు.
చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న క్యాబినెట్ విస్తరణను పూర్తి చేద్దామని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఎమ్మెల్యేల కామెంట్స్ వల్ల విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. శాసనసభ్యులు ఎరు ఇష్టమొచ్చినట్లు వారు బెదిరింపు, బ్లాక్ మెయిల్ ధోరణిలో మాట్లాడుతుంటే ఇప్పుడు విస్తరణ తేనతుట్టను కదపడం అవసరమా అన్న ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నట్లు పార్టీ సీనియర్లు చెపుతున్నారు. ఈ శాసనసభ్యులు నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్లనే అధిష్టానం ఇప్పట్లో విస్తరణ పై నిర్ణయం తీసుకునే పరిస్ధితి కనిపించడం లేదని సీనియర్లు అంటున్నారు. అంతా మీ వల్లే జరిగిందని స్వయంగా రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎల్‌పీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ పై కూడా సీయం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తనకు సంబంధం లేకపోయినా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రోజుకో శాసనసభ్యుని పేరు మీడియాకు లీక్ చేసి గందరగోళానికి కారణమయ్యాడని సీఎల్‌పీ భేటీలో అందరి ముందే సీయం రేవంత్ రెడ్డి ఎంపీ చామల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమావేశంలోనే రేవంత్ రెడ్డి ఆయనకు క్లాసు తీసుకున్నారు.
కేవలం విస్తరణకు సంబంధించిన అంశాలపైనే వివాదం కాదు కీలకమైన, సున్నితమైన అంశాలకు సంబంధించి సైతం కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏకంగా క్యాబినెట్ మంత్రిపైనే ఆరోపణలు విమర్శలు చేశారు… కాంటాక్ట్ పనులు బిల్లుల చెల్లింపులో ఒక మంత్రి మాట మాత్రమే చెల్లుబాటు అవుతోందని తమకు అవకాశం లభించడం లేదని తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగడంలేదని ఆయన ఆరోపించడంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలతో కలిపి ప్రత్యేకమైన సమావేశం నిర్వహించడం అప్పట్లో సంచలనమైంది. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని కూడా ఆయన పదేపదే చెపుతున్నారు. ఇక షాద్ నగర్ వీర్లపల్లి శంకర్ ఏకంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించి చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీనిపై స్వయంగా పిసిసి అధ్యక్షులు జోక్యం చేసుకొని వివరణ కోరడంతో పాటు నోటీస్ కూడా ఇచ్చారు. ఇలా ఏదో ఒక అంశంపై కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న ఎమ్మెల్యేలు చేసిన కామెంట్స్ ఒకెత్తైతే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన చాలామంది ఎమ్మెల్యేలు సైతం ఇస్టారాజ్యంగా ఏది పడితే అది ఒక క్రమశిక్షణ లేకుండా మాట్లాడేయడం రేవంత్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెస్తోంది.
మొన్న జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు జరుతున్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడంతో ఆ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికైతే సైలెంట్ గానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అంత ఈజీగా ఎవరిని సైలెంట్ చేయలేరు. ఈ మౌనం ఎంత కాలం ఉంటుందో వేచి చూడాలి.