తెలంగాణ రాష్ట్రంలోని పద్మశాలీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వరాలు కురిపించారు. పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగ పరంగా అభివృద్ధి పరంగా క్రియాశీల నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అఖిల భారత పద్మశాలి మహాసభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో రైతన్నలకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, చేనేత రంగంలో ఉన్న వారికి కడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఆత్మగౌరవంలోనే కాకుండా, త్యాగంలోనూ పద్మశాలీ సోదరులు ముందు ఉంటారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. పద్మశాలీ సోదరులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. టైగర్ నరేంద్రను రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. టైగర్ నరేంద్ర త్యాగం లేకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది అందరికీ తెలుసన్నారు. అయితే, టైగర్ ఆలె నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా చేసిందని, కానీ, కేసీఆర్ అనే ధృతరాష్ట్రుడు మాత్రం ఆలె నరేంద్ర స్థాపించిన పార్టీని అప్పటి టీఆర్ఎస్‌లో విలీనం చేసుకొని.. చివరకు ఆలె నరేంద్రను ఖతం చేశారని ఆ వివరాలు పద్మశాలీ సోదరులందరికీ తెలుసునని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇక, టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన సమయంలో ఆ పార్టీకి ఓ నీడను కల్పించిన కొండా లక్ష్మణ్ బాపూజీకి కూడా కేసీఆర్ చివరకు నిలువ నీడ లేకుండా చేశాడని సీఎం రేవంత్ మండిపడ్డారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కనీసం చూడటానికి కూడా కేసీఆర్ వెళ్లలేదని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ లేదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం కూడా చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మాట్లాడి ఐఐహెచ్‌టీ సాధించామని, అంతేకాకుండా.. ఆ సంస్థకు కొండా లక్ష్మణ బాపూజీ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదర్శమూర్తిగా నిలిచిన లక్ష్మణ్ బాపూజీ పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి పెడతామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో తెలంగాణకు చెందిన పద్మశాలీలు చాలా మంది ఉన్నారని.. అక్కడి రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో తెలంగాణ నేతన్నలది కీలక పాత్ర అని, షోలాపూర్లో పద్మశాలీల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా.. మార్కండేయ భవనం నిర్మాణానికి కోటి రూపాయలు ఇచ్చి సహకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకమైన బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ ఆర్డర్లను రద్దు చేస్తే నేతన్నలు ఇబ్బందులు పడతారని టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. దాంతో ఈ రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇచ్చేలా ఒక కోటి 30 లక్షల చీరలు పద్మశాలీలకు ఆర్డర్ ఇచ్చామని రేవంత్ రెడ్డి వివరించారు.