కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల అయ్యింది. ఈమేరకు ఏఐసీసీ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. నోటిఫికేషన్ మేరకు సోమవారం నామినేషన్లకు చివరి రోజు. దీంతో, కాసేపటి క్రితం ఏఐసీసీ ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలను విడుదల చేసింది.\
కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఉన్న బలం మేరకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు లభిస్తాయి. అయితే, ముగ్గురి పేర్లతో అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా వెలువరించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఏఐసీసీ ప్రకటించింది.
సీపీఐకి ఒక సీటు :
ఇక, కాంగ్రెస్ ఖాతాలోకి రావాల్సిన నాలుగో సీటును సీపీఐకి కేటాయిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఉత్తర్వుల్లోనే ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో, సీపీఐ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతోంది.
కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా ఒక ఎమ్మెల్సీ స్థానం తమకు కేటాయించడంతో సీపీఐ నేతలు హుటాముటిన ముగ్దుం భవన్‌లో సమావేశమయ్యారు. సీపీఐ కార్యదర్శి వర్గం భేటీ అయ్యింది. సీపీఐ నుంచి ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయాల్సిన పేరును ఖరారు చేసేందుకు ముఖ్యనేతలందరూ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు.
బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ :
అలాగే, బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కాసేపటి క్రితమే కేసీఆర్.. ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేశారు. దాసోజు శ్రవణ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. కానీ, ఆ సమయంలో తృటిలో దాసోజు శ్రవణ్‌కు ఎమ్మెల్సీ అవకాశం చేజారిపోయింది. దీంతో, ఇప్పుడు ఆయనకు మరోసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.