ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ చీపుర్లు పట్టారు. అయితే ఒకే చోట కాదు.. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరూ చీపుర్లు పట్టి పరిసరాలు శుభ్రం చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం చంద్రబాబు, లోకేష్ పారిశుధ్య కార్మికులతో కలిసి చెత్తపై సమరం ప్రకటించారు. పారిశుధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలని, ప్రజల్లో ఈ అంశంపై చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు చెత్త ఊడ్చారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా తణుకులో పర్యటించిన చంద్రబాబు.. పారిశుధ్య కార్మికులతో కలిసి ఓ పార్కులో చెత్తను శుభ్రం చేశారు. స్వయంగా తాను కూడా చీపురు పట్టుకొని చెత్త ఊడ్చారు. డబ్బాలోకి చెత్త ఎత్తి చెత్తకుండీలో పడేశారు. ఆ తర్వాత పారిశుధ్య కార్మికుల డ్రెస్ వేసుకొని వాళ్లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు చంద్రబాబు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు వినేందుకే తాను వచ్చానన్నారు. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. చరిత్రలో తొలిసారి మధ్యతరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చామని, ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.
ఇక, చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ కూడా మంగళగిరిలో పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్కులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా చెత్తను శుభ్రం చేశారు. చీపురుతో చెత్త ఊడ్చి.. చెత్తను చెత్తకుండీలో వేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో లోకేష్ ముఖాముఖి మాట్లాడారు. వాళ్ల యోగక్షేమాలు అడిగి తెఉసుకున్నారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య నిర్వహణకు కావాల్సిన సామాగ్రి ఎలా ఉందని.. చెత్తకుండీలు ఉన్నాయా అని అడిగారు లోకేష్. ఎకో పార్క్ లో ఏం చేస్తే ఇంకా బాగుంటుందని అడిగి తెలుసుకున్నారు.ప్రజలు నిద్రలోకి వెళ్లాక పారిశుద్ధ కార్మికులు పరిసరాలను శుభ్రం చేస్తారని నారా లోకేష్ ప్రశంసించారు. పారిశుద్ధ్య నిర్వహణలో మంగళగిరిని నెం.1 స్థానంలో నిలబెడతామని అన్నారు.