బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి మాదిరిగా.. ఏదీ పట్టకుండా, అభివృద్ధి చేయకుండా.. తమ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉండలేరని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి వేసిన ప్రశ్నలకు దీటుగా, ఘాటుగా, సవివరంగా, గణాంకాలతో సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వాళ్ల మాదిరిగా ఆరు సంవత్సరాలు పెండింగ్ లో పెట్టకుండా తాము మూడు నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామన్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో రూ.124 కోట్లు రుణమాఫీ చేస్తే.. తమ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే రూ.263 కోట్లు రుణమాఫీ చేసిందని ప్రకటించారు. ఇక, కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వేల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రూ.104.3 కోట్ల రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.237.33 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. 2018లో హరీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ రూ.96.62 కోట్లు అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ రూ.177.91 కోట్లు అని చెప్పారు. ఇక, కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో చూస్తే.. బీఆర్ఎస్ హయాంలో 2018లో రూ.101.76 కోట్ల రుణమాఫీ చేశారని, ఇప్పుడు కాంగ్రసె్ ప్రభుత్వం రూ.175.84 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో కూడా రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించిన సమాచారం ప్రదర్శిస్తామన్నారు. ప్రతి సంక్షేమ పథకం వివరాలు లెక్కలతో సహా ఎమ్మెల్యేలకు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. గ్రామాల వారీగా ఫ్లెక్సీ లపై కూడా ప్రదర్శిస్తామని అన్నారు. రైతు రుణమాఫీ మాత్రమే కాదు, సన్నాలకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ప్రతి స్కీంకు సంబంధించిన వివరాలు లెక్కలతో సహా ఇస్తామని ఎదురుదాడి చేశారు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా తాము పనులు చేయకుండా ప్రచారం చేసుకోలేదన్నారు.
రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను బీఆర్ఎస్ సర్కారు గాలికి వదిలేస్తే.. తాము మాత్రం 12 మంది వీసీలను నియమించామన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలను సైతం తీసుకున్నామని చెప్పారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దళితుల్ని వీసీ గా నియమించిందన్నారు. నగరం నడిబొడ్డన ఉన్న మహిళా యూనివర్సిటీకి మీరు ఎప్పుడైనా వెళ్లారా ? అని ప్రశ్నించారు. తాము ఆ యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి.. కలియతిరిగి పాత వారసత్వ భవనాల మరమ్మతుకు వెంటనే రూ.15 కోట్లు విడుదల చేశామన్నారు. ఇవి కాకుండా రూ.540 కోట్లు బిల్డింగులు కట్టడానికి వెంటనే ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇది బంధం.. తమ అనుబంధం అని, తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కమిట్మెంట్ అని నొక్కి వక్కాణించారు.
ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ న భూతో నభవిష్యత్తు అని గర్వంగా చెబుతున్నామన్నారు. 20 ఎకరాల్లో డిజిటల్ బోర్డులు, క్రికెట్, ఫుట్బాల్ మైదానాలు, బోధన సిబ్బంది అక్కడే ఉండేలా నిర్మాణాలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకేసారి 58 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేయలేదని, తాము ఒక్కో స్కూలు రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని.. ఇది తమ ముఖ్యమంత్రి కమిట్మెంట్ అని స్పష్టం చేశారు. ఎస్ సి ,బి సి, ఎస్ టి వర్గాలకు విద్యారంగంపై తమ ప్రభుత్వం కమిట్మెంట్ ఇదన్నారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీపడాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించి.. మహేంద్ర & మహేంద్ర వంటి పారిశ్రామికవేత్తలను పిలిచి వారికి కావాల్సిన నైపుణ్యాలు విద్యార్థులకు నేర్పించి రిక్రూట్మెంట్ అవకాశాలు కూడా కల్పిస్తున్నామన్నారు. పరిశ్రమలకు అవసరమైన నిపుణులను అందించేందుకు 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చి దిద్దుతున్నామన్నారు.
ముఖ్యమంత్రికి సమయం లేదని, విద్యాశాఖను పట్టించుకోవడం లేదంటూ ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖకు చేస్తున్న సేవలు చూస్తే గర్విస్తున్నామన్నారు. మీ సీఎం లాగానే మా సీఎం కూడా ఉండాలని ఊహించుకుంటే ఎట్లా అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించామని, మరో ఆరువేల ఖాళీల భర్తీకి కృషి చేస్తున్నామని, 22,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిన విద్యాశాఖలో 36,000 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసామన్నారు.