38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

నామినేటెడ్‌ పదవులకు 60వేల మంది పోటీ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం గత యేడాది అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొన్ని నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. ప్రధానంగా కీలకమైన 62 కార్పొరేషన్‌ పోస్టులు భర్తీ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఖాళీ అయిన మిగతా నామినేటెడ్‌ పదవుల కోసం ఆశావహులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. కూటమి సర్కారు ఏర్పడి పది నెలలు కావడంతో ఇంకెప్పుడా? అని చాలామంది ఆశ పడుతున్నారు. ఇప్పటికే తమకు పదవులు ఇవ్వాలంటూ.. ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఎంతలా అంటే.. ఒక్క నామినేటెడ్‌ పోస్టుకు 46మంది పోటీ పడుతున్నారట.

ఇప్పటికే భర్తీ అయిన 62 కార్పొరేషన్‌ పోస్టుల్లో కూటమిలోని మూడు పార్టీలకు సర్దుబాటు చేశారు. వీటిలో 49, 10, 3 చొప్పున పదవులను పంచుకున్నారు. అంటే కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన తెలుగు దేశం పార్టీకి 49 పోస్టులు, జనసేనకు 10 పదవులు, బీజేపీకి 3 పదవులు దక్కాయి. ఇక, రాష్ట్రంలో 214 మార్కెట్‌ కమిటీలు, 1100 ట్రస్ట్‌ బోర్డుల్లో నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. అంటే అవన్నీ కలిపి 1,314 పోస్టులు ఉన్నాయి. వీటికోసం ఏకంగా 60 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారట. అంటే.. నామినేటెడ్‌ పోస్టులకు రద్దీ నెక్ట్స్‌ లెవెల్‌ అంటున్నాయి ఏపీలోని రాజకీయ వర్గాలు.

నామినేటెడ్‌ పదవులకు కావాల్సిన అర్హతలు, పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడ్డవాళ్లు ఇలా చాలా కేటగిరీల వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఇక వాళ్లను గుర్తించేదెలా? అంటే.. ఈ బాధ్యతను పార్టీలోని సీనియర్లు, మంత్రులకు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక, నామినేటెడ్‌ పదవుల భర్తీకి జూన్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నారు. కానీ, నామినేటెడ్‌ పదవుల భర్తీలో ఆలస్యం అవుతోందని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయడానికి చంద్రబాబు తీవ్ర కసరత్తులు చేస్తున్నారట. అయితే, ఆ పదవులకు తగిన పేర్లను అందించడంలో కొంతమంది నేతలు జాప్యం చేస్తుండడంతో.. వెయిటింగ్‌ లిస్టుతో వెయిటింగ్‌ టైమ్‌ కూడా పెరిగిపోతోందంటున్నారు.

ఇక, తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో.. తాజాగా పార్టీ కోసం కష్టపడ్డవారి పేర్లను సిఫార్సు చేయాలని సీనియర్‌ నేతలకు చంద్రబాబు సూచించారు. అలాగే, 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్‌లను నియమిస్తామన్నారు చంద్రబాబు. అంతేకాదు.. ఇప్పుడు పదవులు రాని వారికి రెండేళ్ల తర్వాత ఇస్తామని భరోసా కూడా ఇచ్చారు. పదవులు రావడానికి షరతులు వర్తిస్తాయంటూ చంద్రబాబు చెప్పారు.పదవుల కోసం 60వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దని, రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగిలినవారికి కూడా అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారంటున్నారు. ఇప్పటికే పదవులు తీసుకున్నవారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామన్న బాబు.. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు హుందాగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తాని చంద్రబాబు హామీనిచ్చారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com