భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు కేంద్రం ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు, 2025పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును పౌరుల డిజిటల్ గోప్యతకు తీవ్ర ముప్పుగా అభివర్ణించారు. ఈ బిల్లు నిబంధనలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పన్ను అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం పరిధికి మించి అధికారాలను వినియోగించుకోవడానికి ఈ బిల్లు సహకరించేలా ఉందని అభిప్రాయపడ్డారు.
కేంద్రం యొక్క కొత్త ఐటీ చట్టం పౌరుల డిజిటల్ గోప్యతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఐటీ అధికారులకు సోషల్ మీడియా, ఈమెయిల్స్, మరియు ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాలపై పన్ను తనిఖీ పేరుతో అపరిమిత అధికారాలను ఇచ్చేలా ఉందని కేటీఆర్ అన్నారు. ఈ బిల్లులో ప్రస్తావించిన ‘వర్చువల్ డిజిటల్ స్పైసెస్’ వేధింపులకు, దుర్వినియోగానికి, విస్తృత నిఘాకు దారితీయవచ్చు. దేశ పౌరుల ఆర్థిక డేటా ఇప్పటికే అనేక సంస్థల ఆధీనంలో ఉందని, ఈ కఠినమైన చట్టం పౌరుల ప్రాథమిక హక్కులను మరియు డిజిటల్ గోప్యతను పూర్తిగా తొక్కేస్తుందని కేటీఆర్ అన్నారు. నూతన చట్టం ఆధారంగా చేసుకుని కొంతమంది అధికారులు, ఈ నిబంధనల ద్వారా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తే దానికి ఎవరిది బాధ్యతనో ప్రధాని మరియు ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని కేటీఆర్ అన్నారు.
ఫిబ్రవరి 2025లో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు, 1961 ఆదాయపు పన్ను చట్టానికి మించి పన్ను అధికారుల అధికారాల పరిధిని విస్తృతంగా పెంచుతుంది. సెక్షన్ 247 ప్రకారం, పన్ను ఎగవేత ఆరోపణలు ఉంటే, సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఆన్లైన్ ఖాతాలతో సహా ఏదైనా “వర్చువల్ డిజిటల్ స్పేస్”ను యాక్సెస్ చేసి సోదా చేయడానికి అధికారులకు అనుమతి ఇస్తుంది. ఇది ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానున్నది. సెక్షన్ 261(i)లో విస్తృతంగా నిర్వచించిన ఈ నిబంధన, స్పష్టమైన రక్షణలు లేకుండా డిజిటల్ భద్రతను అతిక్రమించడానికి అనుమతిస్తుంది. ప్రస్తుత చట్టం భౌతిక ఆస్తులపై దృష్టి పెడుతుండగా, ఈ నిబంధన దీనికి పూర్తి భిన్నంగా ఉన్నది.
ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం పౌరులకు రాజ్యాంగబద్ధంగా దక్కిన హక్కులను హరించేలా వ్యవహరించే ప్రమాదం ఉండాలని, పూర్తిగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు. ఆదాయపు పన్ను వ్యవస్థకు ప్రస్తుత నిఘా వ్యవస్థలు సరిపోతాయన్న కేటీఆర్, ఈ అపరిమిత అధికారాలను నియంత్రించడంలో ప్రధాని మోదీ మరియు ఆర్థిక మంత్రి సీతారామన్ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లు దేశ ప్రజలకు దక్కిన డిజిటల్ హక్కులపై జరుగుతున్న దాడిగా అభివర్ణించిన కేటీఆర్, పౌరులు మరియు విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరారు .