38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

పునః ఫిరాయింపులు

  • కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు
  • మహిపాల్ రెడ్డి నుంచి దానం వరకు
  • కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఆరోపణలు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల ప్రయోజనం లేదంటున్న కాంగ్రెస్ నేతలు
  • కాంగ్రెస్ తో కలిసి రావడం లేదంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు

అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ శాసనసభ్యుల వ్యవహార సరళి ఇప్పుడు ఆపార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీకి చిక్కులు తెస్తున్నామన్న ఆలోచన లేకుండా… ఏది పడితే అది మాట్లాడి వివాదాస్పదం అవుతున్నారు. ఎక్కడో… ఎప్పుడో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కెమెరాల సోయ ఏలకుండా చేసిన వ్యఖ్యలు సోషల్‌ మీడియాలో ట్రోల్‌కి గురై హల్‌ఛల్‌ చేస్తున్నాయి. నేరుగా ముఖ్యమంత్రిపైనా లేకపోతే ఏకంగా కాంగ్రెస్‌ పార్టీపైనా ఈ ఫిరాయింపు నేతలు పరుష పదజాలంతో చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి సమస్యలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ ను కించ పరుస్తు, ముఖ్యమంత్రిని తక్కువ చేస్తూ పబ్లిక్‌లో ఈ ఫిరాయింపు శాసనసభ్యులు చేస్తున్న విమర్శలు సాంప్రదాయ కాంగ్రెస్‌ శ్రేణులను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. అటు వీరి మీద చర్యలు తీసుకోలేక అలా అని పార్టీలో కలుపుకోలేక అధికార కాంగ్రెస్‌ సతమతమవుతోంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బిఆర్ఎస్ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తాము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా బహిరంగంగానే ప్రకటించారు.. ఈ పదిమంది ఎమ్మెల్యేల్లో అందరూ కాకపోయినా కొందరు మాత్రం ప్రస్తుతం అధికార పార్టీకి కంటిలో నలుసుల్లా తయారయ్యారు. పార్టీ మారిన కొంతమంది ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నా మరికొందరు మాత్రం సమయం సందర్భం లేకుండా ఎక్కడపడితే అక్కడ అధికార పార్టీని ఇరుకు పెట్టే విధంగా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. వీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసలు వీరు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారా లేక ఏ అర్ధరాత్రో వెళ్ళి కేసీఆర్‌నో కేటీఆర్‌నో కలసి మీము కాంగ్రెస్‌లో ఉన్న మీ మనుషులమే అవసరమైనప్పుడు మళ్ళీ ఫిరాయిస్తామని చెప్పి వచ్చారా అనే అనుమానం ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు కలుగుతోంది.

మొదటగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విషయానికొస్తే… ఆయన మొదటి నుంచి కొంత గందరగోళంగానే ఉన్నారు. బిఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లుగా మొదట ప్రకటించారు. తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ ని కలిసి నేనెటూ పోవట్లేదు అని అన్నారు. ఆ తర్వాత జిల్లాకు వెళ్లి నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని మరోసారి ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఆయన కామెంట్స్ అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. నేను బీఆర్‌ఎస్‌ టికెట్‌తో గెలిచిన ఎమ్మెల్యేను. ఆ పార్టీలోనే ఉన్నాను. నా ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ ఫ్లెక్సీలలో వాడుకొని ప్రజలను గందరగోళపరుస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరచారు.

అయితే కృష్ణమోన్‌రెడ్డి తీరుపై జిల్లా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దని పార్టీకి దూరం పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో ఎమ్మెల్యే విషయానికి వస్తే… ఈయన తీరు కాంగ్రెస్ పార్టీలో ఘర్షణలకే దారితీస్తున్నాయి. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించి రేవంత్ రెడ్డిని కలిసి కండువా కూడా కప్పించుకున్నారు. కానీ కొద్ది రోజులకే తన ఇంట్లో కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంటుందని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన ఫొటో పెట్టుకోవాలని ఎక్కడైనా ఉందా అని వ్యాఖ్యానించి అధికార కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పడేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ విషయంపై ఘర్షణకు కూడా దిగారు. అయినా కెసిఆర్ ఫోటో తీసే ప్రసక్తే లేదని మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీనీ పరుష పదజాలంతో దూషిస్తూ ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఒక పనికిమాలిన పార్టీ అంటూ మహిపాల్‌ రెడ్డి కామెంట్ చేశారు. మహిపాల్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో… కక్కలేక మింగలేక అన్నట్లు ఉంది కాంగ్రెస్‌ పరిస్ధితి.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయానికి వస్తే ఆయన ప్రతిరోజు ఏదో విధంగా అధికార పార్టీని తిడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా సికింద్రాబాద్ ఎంపీగా కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే తెలంగాణను అభివృద్ధి పరచడంలో కేసీఆర్ కి మించిన వారు లేరని బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ఫోటో పెట్టుకుంటే తప్పేంటి అని కూడా సమర్థించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాను ప్రతిరోజు తిడుతూనే ఉన్నారు. హైడ్రా ఆధికారులపై కామెంట్స్ చేస్తున్నారు.. వారిని ఫీల్డ్‌లో బెదిరిస్తున్నారు. ఇక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించి సీఎంని కలిసినా… ఆ తర్వాత అంతర్గతంగా జరుగుతున్న నియోజకవర్గ స్ధాయి సమావేశాల్లో మాత్రం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సైతం ఈ అంశంపై ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పై సీఎం కే ఫిర్యాదు చేశారు.

ఇలా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు అధికార పార్టీకి న్యూసెన్స్ గా మారింది. అయితే ఈ ఎమ్మెల్యేలకు కొన్ని హామీలు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని వాటిని అమలు చేయకపోగా పట్టించుకోవడంలేదని అందుకోసమే కొందరు ఎమ్మెల్యేలు ఈ రకంగా బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదులు చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఎవరి వాదన ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీలోనే చేరి అదే పార్టీపై బహిరంగంగా కామెంట్స్ చేయడం ఆయా జిల్లాల కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదు. ఇలాంటి వారిని దూరం పెట్టాలని వాళ్ళు సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం టెక్నికల్ గా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అంటున్నారు. నిజానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ పది మంది ఫిరాయింపు శాసనసభ్యుల  సహకారంతో మొత్తం ఐదు స్ధానాలను  కాంగ్రెస్ పార్టీ గెలిచుకునే అవకాశం ఉన్నప్పటికీ… ఫిరాయించిన కొంతమంది ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీ ఐదో అభ్యర్థికి దూరంగా ఉన్నట్టుగా తెలిసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com