27.7 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ప్రభుత్వానికి కులగణన నివేదిక – ఎల్లుండి కేబినెట్‌లో చర్చ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ కులగణన, సామాజిక సర్వేలో 3.50 కోట్ల మంది తమ వివరాలు ఎన్యుమరేటర్లకు అందజేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వెనుక బడిన తరగతులకు చెందిన వారికి న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వం ఆకాంక్ష అని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన అంశంపై సేకరించిన వివరాలకు సంబంధించి సమగ్ర నివేదికను ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా మంత్రివర్గ ఉపసంఘానికి అందజేశారు. ఈ సందర్భంగా కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యంది. ఉపసంఘం భేటీలో సమగ్ర కులగణన వివరాలను సందీప్‌ సుల్తానియా కేబినెట్‌ సబ్‌కమిటీకి అందజేశారు. ఆ భేటీ ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో సామాజిక, కులగణన సర్వే చేపట్టామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

అసెంబ్లీ తీర్మానం మేరకు… :

మనదేశంలో జాతీయస్థాయిలో ప్రతి పదేళ్లకోసారి జనగణన జరుగుతోందని, స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. కానీ, వాస్తవంగా పేదల స్థితిగతులు గుర్తించేందుకు మాత్రం కులగణన చేపట్టడం లేదన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన సర్వే చేపట్టాలని సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కుల గణన చేయాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిందని గుర్తు చేశారు. అసెంబ్లీ తీర్మానం మేరకు బలహీనవర్గాల అభ్యున్నతికి అవసరమైన అన్ని రకాల వివరాలను సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టామని చెప్పారు.

సర్వేలో పాల్గొన్న 96.9శాతం మంది :

తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఈ సామాజిక సమగ్ర కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని మంత్రి చెప్పారు. ఈ సర్వేలో 96.9శాతం మంది పాల్గొన్నారు. అంటే.. 3 కోట్ల 50 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొని ఎన్యూమరేటర్లకు తమ సమగ్ర వివరాలు అందించారని, 3.1 శాతం మంది.. అంటే.. 16 లక్షల మంది మాత్రం ఈ సర్వేలో వివరాలు అందించలేదని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు.

4న కేబినెట్‌లో చర్చ :

రాష్ట్రం మొత్తం చేపట్టిన ఈ సర్వేలో భాగంగా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి ఇతర అంశాలపై ఎన్యూమరేటర్లు సమగ్ర అధ్యయనం చేసి వివరాలు సమర్పించారన్నారు. అయితే, ఈ సమగ్రసర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించారని, అయినా.. అధికారులు విజయవంతంగా సర్వేను పూర్తి చేశారని అభినందించారు. ఈనెల 4వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో కేబినెట్‌ ముందు కులగణన సర్వే నివేదిక ప్రవేశపెడతామన్నారు. ఆ వెంటనే కేబినెట్‌లో చర్చించి వెంటనే శాసనసభలో కూడా ఈ నివేదికను ప్రవేశ పెడతామని చెప్పారు. ఈ సర్వే వివరాలు అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేయడం ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో సామాజిక వర్గాల జనాభా ఇదీ :

ఇక, ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలోని ప్రధాన అంశాలు చూద్దాం.. తెలంగాణలోని 3,54,77,554 మంది ఈ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేశారు. కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం ఉండగా.. సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతం ఉన్నట్లు గుర్తించారు. సమగ్ర కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43 శాతం ఉన్నట్లు తేలింది. అలాగే, అలాగే, తెలంగాణలో ఎస్టీల జనాభా 10.45 శాతం ఉన్నట్లు తేలింది. ఇక, రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతం ఉండగా.. ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08గా నమోదయ్యింది. ముస్లిం మైనారిటీ బీసీలతో కలుపుకుంటే.. మొత్తం బీసీల జనాభా తెలంగాణలో 56.33 శాతంగా ఉంది. ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం ఉన్నట్లు తేలింది. ఇక.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వే తేల్చింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com