కాంగో వీధుల్లో రక్తం ఏరులై పారుతోంది. ప్రస్తుతం కాంగోలోని గోమా సిటీలో ఎక్కడ చూసిన మృతదేహాలు చెల్లా చెదరుగా పడి ఉండటం కనిపిస్తోంది. కాంగో ఆర్మీ, తిరుగుబాటుదారుల మధ్య కొనసాగుతున్న యుద్ధం తీవ్రతరం కావడంతో ఏకంగా 773 మంది మృతి చెందారు. ఇది అధికారక లెక్కే. నిజానికి ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇకగాయపడ్డ వారి సంఖ్య 2,800 దాటింది.
కాంగోలో ఎన్నో ఏళ్లుగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ దేశంలో అనేక తిరుగుబాటుదారుల గ్రూపులు ఉన్నాయి. ఇందులో M23 అనే గ్రూప్ ప్రస్తుతం శక్తివంతంగా ఉంది. ఎందుకంటే పక్కనే ఉన్న రువాండ సైన్యం పూర్తిగా మద్ధతిస్తోంది. దీంతో భారీగా ఆయుధాలు సమకూర్చుకున్న ఈ గ్రూప్ సైన్యంపై విరుచుకపడుతోంది.
కాంగోలోని గోమాపై పట్టుసాధించాలని చూస్తున్నాయి తిరుగుబాటుదారు గ్రూప్‌లు. 2012లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కూడా ఈ నగరంపై పట్టు సాధించిన రెబల్స్‌ను ఏరివేస్తోంది కాంగో సైన్యం. ఇప్పటికే తిరుగుబాటుదారుల చేతి నుంచి చాలా ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఇంకా చాలా ప్రాంతాలపై వారిదే పట్టు అని చెప్పాలి. అయితే ఈసారి జరిగిన దాడుల్లో ఎక్కువగా నష్టపోయింది మాత్రం కాంగో సైన్యమని తెలుస్తోంది.
అయితే కాంగోలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. తిరుగుబాటుదారులు తమ నెక్ట్స్ టార్గెట్ రాజధాని నగరమైన కిన్షాసా అని ప్రకటించారు. దీంతో మరింత మంది ప్రజలు ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రెబల్స్ భయంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు.
నిజానికి కాంగోలో ప్రస్తుతం సంక్షోభం జరుగుతున్న ప్రాంతం అనేక ఖనిజాలకు నిలయం. అందుకే ఈ ప్రాంతంపై పట్టు సాధించాలని రెబల్ గ్రూప్‌లు పోటీ పడుతున్నాయి. అదే ఇన్ని సంక్షోభాలకు కారణంగా ఉంది. అయితే కాంగోలో ఉన్న భారతీయులు సురక్షితంగా ఉన్నారని విదేశాంగశాఖ తెలిపింది. అత్యవసరమైతే వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.