26.7 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

జాగ్రత్తగా సమర్పించారు

  • 184 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఓటమి
  • టాప్ ఆర్డర్ ఘోర వైఫల్యం
  • సిరీస్… 2-1తో ఆస్ట్రేలియా ముందడుగు

టీమ్ ఇండియా ఘోర వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒకరిని మించి ఒకరు నువ్వా నేనా? అన్నట్టు పోటీలు పడి మరీ వికెట్లు సమర్పించుకున్నారు. మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోరంగా ఓటమి పాలైంది. ఆఖరిరోజు ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 184 పరుగుల తేడాతో ఓడి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

ఐదోరోజు ఆస్ట్రేలియా ఆఖరి వికెట్ తో ఓవర్ నైట్ స్కోరు 333 పరుగులతో ప్రారంభించింది. సరిగ్గా 7 పరుగులు జోడించిన అనంతరం ఆలౌట్ అయ్యింది. 340 పరుగులతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఎప్పటిలా త్వరత్వరగా వికెట్లు పారేసుకుని, విజయాన్ని మూటగట్టి ఆస్ట్రేలియాకి సమర్పించింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు 2-1తో ముందడుగు వేసింది.

ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (84), రిషబ్ పంత్ (30) ఇద్దరు మాత్రమే ఆడగలిగారు. మిగిలిన వారెవరూ ఆస్ట్రేలియా బౌలింగుని ఎదుర్కోలేక విలవిల్లాడరు. సిరాజ్, బుమ్రా, కేఎల్ రాహుల్ ముగ్గురు డక్ అవుట్లు అయ్యారు. వీరాధివీరులు కెప్టెన్ రోహిత్ శర్మ అతికష్టమ్మీద 40 బాల్స్ ఆడి 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక మరో సీనియర్ హీరో విరాట్ కొహ్లీ 5 పరుగులు మాత్రమే చేసి అయిపోయాడు.

ఇక తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన నితీశ్ కుమార్, అలవాటైన పిచ్ కాబట్టి, కాపాడతాడని అనుకుంటే, తను ఒక్క పరుగు మాత్రమే చేసి పెవెలియన్ బాట పట్టాడు. ఇక ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా (2), ఆకాశ దీప్ (7) ఇలా అందరూ సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోయారు. వాషింగ్టన్ సుందర్ మాత్రం 5 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఇలా నువ్వా? నేనా? అంటూ బ్యాట్ పట్టుకుని వచ్చినంత సేపు క్రీజులో ఉండలేకపోయారు. ఏదో అర్జంటు పని ఉన్నట్టు హడావుడిగా డగౌట్ సైడు సాగిపోయారు. ఆస్ట్రేలియా బౌలింగులో కెప్టెన్ కమిన్స్ (3), స్కాట్ బొలాండ్ (3), నాథన్ లయన్ (2), ట్రావిస్ హెడ్ (1), స్టార్క్ (1) వికెట్ తీసి టీమ్ ఇండియా పతనాన్ని శాసించారు. సిరీస్ లో 2-1తో ఆధిక్యాన్ని అందుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com