మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మన్మోహన్‌కు నివాళులర్పించేందుకు ప్రభుత్వ పక్షంతో పాటు.. అన్ని పార్టీల నాయకులకు అవకాశం కల్పించారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్‌సింగ్‌కు దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్న సమయంలో రాహుల్‌గాంధీ వియత్నాం వెళ్లారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రస్తావించారు. అలాగే, కాంగ్రెస్‌పార్టీ గతంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తెలుగు బిడ్డ అయిన మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న ఇవ్వలేదని, బీజేపీ ప్రభత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీవీ నర్సింహారావును భారతరత్న ప్రకటించి గౌరవించుకున్నామని గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సంతాపతీర్మాన సమావేశం అని.. గొప్పనేతకు నివాళులర్పిస్తోన్న సమయంలో రాజకీయాలకతీతంగా మాట్లాడాలని సూచించారు. కేవలం మన్మోహన్‌కు సంతాపం తెలియజేసే అంశాలు మాత్రమే మాట్లాడాలన్నారు. తీర్మానానికి సంబంధం లేని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో, రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలను శాసనసభ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ మాట్లాడిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. సంతాపం సందర్భంగా మన్మోహన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవమానాలను కూడా గుర్తు చేశానన్నారు. మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను మరోమంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఆక్షేపించారు. రాహుల్ గాంధీ విదేశీపర్యటనపై అభ్యంతరాలుంటే బయట ప్రెస్‌మీట్ పెట్టుకోండి కానీ, తీర్మానసమావేశంలో సభను తప్పుదారి పట్టించొద్దని హితవు పలికారు. తెలంగాణ ఇచ్చిన నాయకుడు మన్మోహన్‌సింగ్‌కు సంతాపం మాత్రమే తెలియజేయాలని సూచించారు. అయితే, పీవీ నర్సింహారావు స్మారకం కూడా ఢిల్లీలో ఏర్పాటు చేయాలని, అలాగే, హైదరాబాద్‌లో పీవీ నర్సింహారావుకు కూడా విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.