కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేశారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, ప్రజామోద రేటింగులు పడిపోవడంతో పార్టీలో వ్యతిరేకత మొదలైంది. దీంతో మిత్రపార్టీలు మద్దతు విరమించుకోవడంతో రాజీనామా చేయక తప్పలేదు. ఈ ఏడాది అక్టోబరులో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ లు భారీ విజయం తప్పదని ఈ సర్వేల సారాంశం. ఆయన రాజీనామా చేశారు కాబట్టి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. లేదంటే ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్‌తో పార్టీ తాత్కాలిక నాయకుడిగా ఎన్నుకొని.. ప్రధానిగా నియమించాలనే వెర్షన్ ఉంది.
2015 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నాడు జస్టిన్ ట్రూడో. మొదట్లో మంచి పాపులారిటీ సాధించిన ట్రూడోపై మెల్లిమెల్లిగా వ్యతిరేకత మొదలైంది. దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో ట్రూడో విఫలమయ్యాడనే విమర్శలున్నాయి. అయితే అంతర్గత కుమ్ములాటల వల్లే ట్రూడో రాజీనామా చేశారనే చెప్పాలి.
ఈ నెల 27న పార్లమెంట్ తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మార్చి 24 వరకు కెనడా పార్లమెంట్ సస్పెండ్ చేశారు. దీంతో ఈలోపు కొత్త నాయకుడిని ఎన్నుకునే బాధ్యత అధికార పార్టీపై ఉంది. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటున్నాయి విపక్ష పార్టీలు.
రాబోయే ఎన్నికల్లో కూడా ప్రధానిగా తానే బరిలోకి దిగాలనుకున్నారు ట్రూడో. ట్రూడో పోటీ చేస్తే గెలవడం కష్టమనేది సొంత పార్టీ నేతల మాట. గత కొన్నేళ్లుగా కెనడాలో ఆహారా, ఇళ్ల ధరలు అమాంతం పెరిగాయి. విదేశాల నుంచి వలస వచ్చే వారి సమస్యలు పెరిగాయని కెనడా వాసులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించడంలో కూడా ట్రూడో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రూడో పాపులారిటీని తగ్గించేశాయి.
మరోవైపు తాను అధికారంలోకి రాగానే కెనడాపై 25 శాతం టారిఫ్ విధిస్తానంటూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ట్రూడో తీరుపై ట్రంప్, ఎలాన్ మస్క్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్‌తో కూడా ట్రూడో గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. ఆయన హయాంలో ఇరు దేశాల సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే సొంత పార్టీ నేతల పంచాయితీ ఇప్పుడు ట్రూడో కొంపముంచింది. రాజీనామా తర్వాత ఆయన పార్టీలో కొనసాగుతారా? లేదా? ఆయన ప్రధాని రేసులో ఉంటారా? లేక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? అనేది చూడాలి.