బీసీ హాస్టల్ విద్యార్థులకు అధునాతన సాంకేతిక విద్య అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవి బీసీ బాలురు హాస్టల్ లో ఎస్ఆర్ శంకన్ రిసోర్స్ సెంటర్ ను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలిసి మంత్రి సవిత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బీసీ హాస్టళ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా బీసీ హాస్టళ్లలో చదువుకునే పేద పిల్లలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,110 బీసీ హాస్టళ్లు ఉన్నాయన్నారు.
వాటిలో తొలి విడతగా 104 బీసీ హాస్టళ్లలో రూ.2 కోట్ల వ్యయంతో ఎస్ఆర్ శంకరన్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిగిలిన హాస్టళ్లలోనూ విడతల వారీగా ఈ రిసోర్సు సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఎస్ఆర్ శంకర్ రిసోర్స్ సెంటర్ కోసం హాస్టళ్లలో ఆధునాత హంగులతో ఓ డిజిటల్ రూమ్ రూపొందించామన్నారు. ఈ సెంటర్ల ద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయన్నారు. కమ్యూనిటీ స్కిల్స్ పెంచేలా తర్ఫీదు ఇస్తామన్నారు. ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్యానల్ ద్వారా పలు సబ్జెక్టుల్లో సీనియర్ ఉపాధ్యాయులు, నిపుణుల బోధనలతో పాటు కంటెంట్ కూడా లభిస్తుందన్నారు. సబ్జెక్టుల వారీగా తమ సంశయాలను విద్యార్థులే స్వయంగా నివృత్తిగా చేసుకోవొచ్చునని మంత్రి తెలిపారు.
హాస్టళ్ల అభివృద్ధికి నిధుల వెల్లువ
గడిచిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బీసీ హాస్టళ్ల్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. బీసీ హాస్టళ్ల మరమ్మతులకు రూ.13.10 కోట్లు కోట్లు మంజూరు చేశామన్నారు. వంట సామాగ్రి, పిల్లల ట్రంకు పెట్టెలు, దుప్పట్లు, ప్లేట్లు వంటి కొనుగోలుకు రూ. 18 కోట్లు అందజేశామన్నారు. జగన్ ప్రభుత్వం పెట్టిన డైట్, కాస్మోటిక్ బకాయిలు చెల్లించామన్నారు. ప్రస్తుతం ఎప్పుటికప్పుడు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో ఉన్న 24 బీసీ హాస్టళ్లకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టర్ రూ.3.37 కోట్లు మంజూరు చేశారన్నారు. బీసీ హాస్టళ్ల విద్యార్థులకు భద్రతతో కూడిన విద్య అందించడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి హాస్టల్ లో మంత్రి సవిత, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మధ్యాహ్నం భోజనం చేశారు. భోజనం నాణ్యతపై వారు సంతృప్తి వ్యక్తంచేశారు.
హాస్టళ్లలో నిరంతర వెలుగులు
బీసీ హాస్టళ్ల విద్యార్థులకు నిరంతర వెలుగులు అందించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ హాస్టళ్లలోనూ ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ నిలిచిపోయినా…హాస్టళ్లలో చీకటి అలుముకోకుండా ఉండాలని సీఎం చంద్రబాబునాయుడు ఇన్వర్టర్లు ఏర్పాటుకు నిదులు మంజూరు చేశారన్నారు. దీంతో పాటు హాస్టళ్ల విద్యార్థుల భద్రతకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తొలి విడతగా బాలిక హాస్టళ్లలో, తరువాత బాలుర హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, జగన్ పాలనలో బీసీ హాస్టళ్లను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సకాలంలో డైట్ బిల్లు రాకపోవడంతో, విద్యార్థులు అర్ధాకలితో అలమటించారన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే, బీసీ హాస్టళ్లు నిధులు మంజూరు చేశారని కొనియాడారు. ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ, చంద్రబాబుతోనే బీసీలకు కలుగుతుందని స్పష్టంచేశారు అంతముందుకు బీసీ హాస్టల్ కు వచ్చిన మంత్రి సవితకు హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి హాస్టల్ లో కలియతిరిగారు. వంట గది, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులను, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. హాస్టల్ నిర్వహణపై మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు.
ఆకట్టుకున విద్యార్థి ఇంగ్లీష్ స్పీచ్
బీసీ హాస్టల్ తొమ్మిదో తరగతి విద్యార్థి కె.కళ్యాణ్ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడిన విధానం మంత్రి సవిత, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సహా ఆహూతులను ఆకట్టుకుంది. తనను పరిచయం చేసుకుంటూ, రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి ప్రసంగంలో విద్యార్థి పేర్కొన్నాడు. స్పీచ్ అనంతరం విద్యార్థి కళ్యాణ్ ను మంత్రి సవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు, ఎంపీపీ దుర్గావాణి, జెడ్పీటీసీ మల్లికార్జునరావు, బీసీ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జగన్ పాలనలో బీసీ విద్యార్థులకు దగా
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, అయిదేళ్ల జగన్ పాలనలో బీసీ హాస్టళ్ల విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. నా బీసీలు అంటూ వెనుకబడిన తరగతులను మోసం చేశారన్నారు. డైట్ బిల్లులు కూడా చెల్లించకుండా హాస్టళ్ల విద్యార్థులను ఇబ్బందుల పాల్చేశారన్నారు. చివరికి మరమ్మతులకు కూడా నిధులు మంజూరుచేయలేదన్నారు. దీంతో హాస్టళ్లలో పోయిన బల్బులు కూడా వేసుకోలేని దుస్థితి నెలకొందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టల్ విద్యార్థులకు బకాయిపడిన డైట్ బిల్లులు మంజూరు చేశారన్నారు. హాస్టళ్లలో మరమ్మతులకు నిధులు విడుదల చేశారన్నారు.