భారత్‌లోకి చొచ్చుకువచ్చి మరీ పర్యాటకులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉగ్రవాదులకు భారత సైన్యం అదను చూసి సమాధానం చెప్పింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ టెర్రరిస్టులకు సరైన సమాధానం చెప్పింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకు పడింది. తొమ్మిది ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అయితే, ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతోనే పాకిస్తాన్‌కు భారత్ బలమైన సందేశం పంపింది. ఈ పేరును ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా పెట్టినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని హిందువులనే వాకబు చేసి మరీ చంపేశారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రమూక టార్గెట్ చేసిన జంటల్లో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవవధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. వినయ్ నేవీ అధికారి కూడా. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ‘ఆపరేషన్ సింధూర్’ను చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంది.