జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై గతనెల 22వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ‘ఆపరేషన్ సిందూర్’తో ధ్వంసం చేసింది. ఈ మెరుపుదాడులతో పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. భారత్ దాడితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలుదేశాల నేతలు స్పందించారు. ఈ ఉద్రిక్త పరిస్థితి త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భారతదేశం-పాకిస్తాన్లను సైనిక సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
త్వరగా ముగియాలి – ట్రంప్ :
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత దాడులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. పహల్గాం దాడిని సిగ్గుచేటుగా ట్రంప్ అభివర్ణించారు. గతం ఆధారంగా ఏదో జరుగబోతోందని ప్రజలకు తెలుసునని అనుకుంటున్నానన్నారు. భారత ప్రభుత్వం చాలాకాలంగా పోరాడుతోందని, దాని గురించి ఆలోచిస్తే వారు అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇది చాలా త్వరగా ముగియాలని తాను ఆశిస్తున్నాన్నారు.
సంయమనం పాటించండి – ఐక్యరాజ్య సమితి :
భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా రెస్పాండ్ అయ్యారు. భారతదేశం-పాకిస్తాన్లను సైనిక సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో భారత సైనిక కార్యకలాపాల గురించి సెక్రటరీ జనరల్ చాలా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గరిష్ట సైనిక సంయమనం పాటించాలని ఆయన రెండు దేశాలకు పిలుపునిచ్చారు. భారతదేశం-పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదన్నారు.
భారత్ చర్యపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు థానేదర్ మాట్లాడుతూ యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదని, కానీ అలాంటి ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు, ఉగ్రవాదులను గుర్తించి శిక్షించడం ముఖ్యమన్నారు.
మిత్రదేశాలకు సమాచారం ఇచ్చిన భారత్ :
ఆపరేషన్ సిందూర్ గురించి భారత సీనియర్ అధికారులు అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యాతో మాట్లాడారు. భారత సైన్యం తీసుకున్న చర్య గురించి వారికి వివరంగా తెలియజేశారు.