దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. స్కూళ్లను టార్గెట్ చేసుకొని బాంబు పేలుళ్లు జరుపుతామంటూ బెదిరింపులకు దిగారు. ఢిల్లీ వ్యాపంగా 40కి పైగా స్కూల్స్‌లో బాంబులు పెట్టామంటూ ఢిల్లీ పోలీసులకు మెయిల్స్ పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. నిన్న రాత్రి 11.30 గంటలకు ఈ మెయిల్ పోలీసులకు వచ్చినట్టు తెలుస్తోంది. 30 వేల డాలర్లు ఇస్తే కానీ వాటిని పేలకుండా ఆపలేరంటూ వార్నింగ్ కూడా ఉంది. దీంతో ఆయా స్కూళ్లల్లో తనిఖీలు నిర్వహించారు ఢిల్లీ పోలీసులు.
బాంబు బెదిరింపుల కారణంగా కొన్ని స్కూళ్లను తెరవలేదు.. మరికొన్ని విషయం తెలిసిన వెంటనే పిల్లలను తిరిగి ఇళ్లకు పంపాయి. బాంబులు చాలా చిన్నవని, ఎవరూ గుర్తించలేని ప్రదేశాల్లో అమర్చామనడంతో ఆయా పాఠశాలల్లో అణువణువు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క బాంబు కూడా లభించలేదు. బెదిరించి కలకలం సృష్టించడానికే ఇలా చేశారని అనుమానిస్తున్నారు. నిందితుడి ఎవరన్నది గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
గతంలో కూడా ఇలానే పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 21న ఢిల్లీ, హైదరాబాద్, తమిళనాడులోని సీఆర్‌పీఎఫ్ స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక అక్టోబర్ 20న ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఏకంగా సీఆర్‌పీఎఫ్ స్కూల్ ఆవరణలో భారీ పేలుడు జరిగింది. సమీపంలో ఉన్న పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో ఢిల్లీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారనే చెప్పాలి. ఈ దాడి చేసింది తామే అని ఖలిస్థాన్ గ్రూప్ క్లెయిమ్ కూడా చేసుకుంది.