ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఈ మేరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రఘురామ డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైనట్లు సభలో ప్రకటించారు. 2019లో వైఎస్సార్సీపీ తరపున నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన రఘరామరాజు ఆ తరువాత పార్టీకి దూరమై చంద్రబాబుకు దగ్గరయ్యారు. తాజాగా ఈ సంవత్సరం మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. తొలుత శాసనసభాపతి స్ధానం ఆశించినప్పటికీ ఆ స్ధానానికి చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని ఎంపిక చేశారు చంద్రబాబు. దీంతో రఘురామ కృష్ణంరాజు ఉపసభాపతి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వేములవాడ అభివృద్ధికి వందేళ్ల ప్రణాళిక… మంత్రి కొండా సురేఖ
మరో 100 ఏళ్ళు మనగలిగే విధంగా వేములవాడ దేవాలయాన్ని తీర్చిదిద్దుతామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. వేములవాడ దేవాలయం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి కార్యకలాపాలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అత్యున్నత సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమీషనర్ హనుమంతు, వేములవాడ ఈవో వినోద్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే వాారి కోసం టూ వీలర్, ఫోర్ వీలర్, బస్ పార్కింగ్ లకు వేర్వేరు స్థలాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు.
దేవాలయ ప్రాశస్త్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని, వేదపాఠశాలను శాస్త్ర ప్రకారం తీర్చిదిద్దాలన్నారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వ నిధులతో పాటు, సిఎస్ఆర్, దాతల విరాళాలు సేకరించాలని కోరారు. బిల్వ వనాన్ని ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ నేత
ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఎస్.రాజీవ్ కృష్ణ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రాజీవ్ కృష్ణతో పాటు చాగల్లు జడ్పీటీసీ విజయదుర్గా శ్రీనివాస్, నిడదవోలు జడ్పీటీసీ కొయ్యా సూర్యారావు, కొవ్వూరు జడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి, ధర్మవరం ఎంపీటీసీ జొన్నకూటి కోమలి, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, తాళ్లపూడి సర్పంచ్ నక్కా చిట్టిబాబు, దొమ్మేరు సొసైటీ మాజీ అధ్యక్షులు గారపాటి వెంకటకృష్ణ, ధర్మవరం సొసైటీ మాజీ అధ్యక్షులు ముళ్లపూడి కాశీ విశ్వనాథ్, దాపర్తి శివప్రసాద్, మర్ని తారక రాము, వల్లూరి సత్యవరప్రసాద్, నీలం వీరభద్రరావు, ఉప్పులూరి రాజేంద్ర కుమార్, ఇమ్మని వీరశంకరం, బండి అశోక్, నల్లా రామ కిషోర్, పామెర్ల నగేష్ కుమార్, నామా సురేంద్ర, వేణు కుమార్ దొప్పలపూడి, ఎన్. దిలీప్ కుమార్, బొల్లిన సతీష్, గారపాటి అభిరామ్, 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు హాజరుకానున్న చిరుమర్తి
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసు విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కోణాలు వెలుగు చూస్తుండటంతో బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్యను ఈ నెల 11వ తేదీ విచారణకు హాజరుకావాలని తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల తాను 11వ తేదీ విచారణకు హాజరు కాలేనని, 14వ తేదీ విచారణకు వస్తానని చిరుమర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం గురువారం ఆయన పోలీసుల ముందుకు విచారణ కోసం హాజరుకానున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ప్రత్యర్దులపై ఫోన్ ట్యాపింగ్ ప్రయోగించారనే అభియోగాలు ఉన్నాయి. అలాగే ఆ ఉప ఎన్నికలో పోలీసుల ద్వారా నగదు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటి మీద ఈ రోజు చిరుమర్తి లింగయ్యను విచారించనున్నారు పోలీసులు.
దూళిపాళ్ళకు ప్రభుత్వ పదవులు ఆమడ దూరం…
దూళిపాళ్ళ నరేంద్ర… సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడు. ఆరు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభకు ఎన్నికైన నేత. అటువంటి నేతకు ప్రస్తుతం టీడీపీలో ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వంలోనే నరేంద్రకు మంత్రి పదవి దక్కుతుందని పార్టీ శ్రేణులు అంచనా వేశాయి. కానీ విచిత్రంగా రాజకీయాల్లోనే కాకుండా శాసనసభ్యుడిగా కూడా తన కన్నా జూనియర్ అయిన పత్తిపాటి పుల్లారావును తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఆ పర్యాయం చేసిన మంత్రివర్గ విస్తరణలో కూడా నరేంద్రపేరు పరిగణలోకి తీసుకోలేదు చంద్రబాబు.
ఇక 2024లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆరోసారి శాసనసభ్యునిగా ఎన్నికైన నరేంద్రను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీంతో కనీసం చీఫ్ విఫ్ గా అయినా తమ నాయకుడికి అవకాశం దక్కుతుందేమో అని పొన్నూరు దేశం తమ్ముళ్ళు వెయ్యికళ్ళతో ఎదురు చూశారు. చీఫ్ విప్ పదవిని గుంటూరు జిల్లాకే ఇచ్చినా నరేంద్రకి కాకుండా వినుకొండ శాసనసభ్యుడు జీవీ.ఆంజనేయులుకు ఇవ్వడం నరేంద్ర అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏకంగా 16 మంది శాసనసభ్యులకు విప్ పదవులు ఇచ్చారు చంద్రబాబు. చివరికి తమ నాయకుడిని ఆ 16 మందిలో కూడా స్ధానం దక్కకపోవడం పట్ల టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పొన్నూరు నుంచి ఆరు పర్యాయాలు శాసన సభ్యునిగా ఎన్నికైన తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కు ప్రభుత్వ పదవులు అందని ద్రాక్షగా మిగిలిపోవడం విచారకరం. గుంటూరు జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లను క్యాబినేట్ లోకి తీసుకోవడంతో నరేంద్రకు స్ధానం కల్పించలేకపోయారు చంద్రబాబు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో కూడా గుంటూరు పార్లమెంట్ స్ధానం నుంచి ఎన్నికైన కమ్మసామాజికవర్గానికే చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ను ఎంపిక చేశారు. ఇలా ఏదో ఒక సమీకరణల కారణంగా నరేంద్రకు ఎప్పుడూ అన్యాయం జరుగుతూ వస్తోందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నరేంద్ర సైతం తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్నా బయట పడలేకపోతున్నారు. పార్టీ పట్ల తిరుగులేని విశ్వాసం, నిబద్ధత కలిగి ఉండడమే కాకుండా పార్టీకి కష్టకాలంలో ట్రబుల్ షూటర్ గా, పార్టీ వాణిని బలంగా వినిపించే గొంతుకల్లో ఒకటిగా, తెలుగుదేశం రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కు ఏ కారణంగానో మొదటి నుంచి అన్యాయం జరుగుతోందని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్‌ఎస్ కుట్ర : డిప్యూటీ సీఎం భట్టి
బీఆర్‌ఎస్ కుట్రపూరితంగా ముందస్తు ప్రణాళిక ప్రకారంగా అరాచక శక్తులతో, అమాయక దళిత గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో కలెక్టర్ దాడి వెనుక కాల్ డేటా తీస్తే.. బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు బయటకు వచ్చిందన్నారు. లగచర్లలో కలెక్టర్ పై దాడి చేసిన సంఘటనలో ఎంతటి పెద్దవారు ఉన్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, అధికారులతో చర్చించడం, న్యాయస్థానాలకు వెళ్లడం ఇవన్నీ అవకాశాలు ఉండగా కుట్రపూరితంగా బిఆర్ఎస్ నాయకులు అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించడం దుర్మార్గమని మల్లు భట్టి విక్రమార్క ఆక్షేపించారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావొద్దని, ఉద్యోగాలు రావొద్దని, అభివృద్ధి జరుగొద్దనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రతిపక్షం వ్యవహరించడం మంచిది కాదని సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ కొరకు భూసేకరణ చేసిన సమయంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షం పార్టీగా రైతుల పక్షాన గొంతెత్తతామని, అధికారులను కలిశామని, న్యాయస్థానానికి వెళ్ళామే తప్ప ఏనాడూ ఇలా దాడులకు తెగబడలేదని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇలా దాడులు చేయించడం కరెక్టేనా? అని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ఈ విషయంపై మాట్లాడాలని సూచించారు. ఇలా దాడులు చేయించడంపై సమాజానికి ఏం సందేశం ఇస్తారని నిలదీశారు. ప్రజా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కుట్రపూరితంగా దుర్మార్గమైన దాడుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులు అధైర్య పడవద్దని భట్టి విక్రమార్క అభయం ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కుట్రపూరితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. అత్యంత వెనుకబడి ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో కూడా పారిశ్రామికీకరణ అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర అభివృద్ధి కోసం డీటెయిల్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్తోందన్నారు. లగచర్లలో దళిత గిరిజనులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్‌ఎస్ చూస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా అమాయకులైన పేద బడుగు బలహీన వర్గాల యువతను రెచ్చగొట్టి ప్రాణాలు బలిగొన్నారని విమర్శించారు. ఇప్పుడు అధికారం పోయేసరికి మళ్ళీ అదే విధంగా అమాయక దళిత గిరిజనులను రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావులు తలకిందులుగా తపస్సు చేసినా ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికే.. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిసి ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలతో ఒప్పందం కుదిరిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయమని చెబుతున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పడం అంటే బిజెపికి ఓటు వేయమని చెప్పడమే అన్నారు. రాష్ట్ర గవర్నర్ పై తమకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని, ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. గవర్నర్ తిరస్కరిస్తే చట్ట ప్రకారం ఏం చేయాలో అదేవిధంగా ముందుకు వెళ్తామని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
సెమీ క్రిస్మస్ వేడుకలపై భట్టి సమీక్ష
డిసెంబర్ 25 న క్రిస్మస్ పర్వదినం పండుగ ను పురస్కరించుకొని ప్రజా ప్రభుత్వం నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు నిర్వహణ, కమిటీ ఏర్పాటుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. క్రిస్మస్ సెలబ్రేషన్ నిర్వహణపై రాష్ట్రస్థాయి కమిటీతో పాటు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే వేడుకలకు సంబంధించి కూడా కమిటీలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసిలో కూడా వేడుకల నిర్వణకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కమిటీల ఏర్పాటు తర్వాత వేడుకల నిర్వాహణకు సంబంధించిన పూర్తి యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ తాప్సీద్ ఇక్బాల్, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ యాస్మిన్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఎండి సబిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
ఈ ట్విస్టేంటీ..?
ఢిల్లీలో అమిత్ షాతో కేటీఆర్ భేటీ..
సోషల్ మీడియాలో సంచలన పోస్టింగ్ చేసిన తెలంగాణ కాంగ్రెస్..
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి డీల్ కుదిరిందంటూ తెలంగాణ పొలిటికల్ సర్కిల్సులో గుసగుసలు.
కాంగ్రెస్ పార్టీ అధికారిక x హ్యాండ్లర్ ఆపన్నహస్తం వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టింగ్ పెట్టింది. అమిత్ షాతో కేటీఆర్ భేటీ అయిన ఫొటోను ట్వీట్ చేసింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కేటీఆర్ కలవనే లేదని.. అమిత్ షాతో కలిశారని.. డీల్ కుదిరిందంటూ పోస్టింగులు పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను అరెస్టును ఆపించుకునేందుకు.. తన అరెస్టుకు గవర్నర్ నుంచి పర్మిషన్ ఇవ్వకుండా చూడాలని కోరుతూ బీజేపీ పెద్దల వద్దకు కేటీఆర్ వెళ్లారని.. కాళ్లా వేళ్లా పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ కామెంట్లకు మరింత బలం చేకూరేలా అమిత్ షా-కేటీఆర్ భేటీ ఉంది. మేమేం చేసినా బాజాప్తానే చేస్తామని చెప్పుకునే కేటీఆర్ అమిత్ షాను తాను కలిసిన విషయాన్ని ఎందుకు బాజాప్తాగా ప్రకటించ లేదు.. గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు దాచి పెట్టారని తెలంగాణ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని.. కారు గూట్లోకి కమలం చేరడం ఖాయమని.. వీలైతే వీలినానికి సిద్దంగా ఉందని వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తూ ఉంటాయి. అమిత్ షా-కేటీఆర్ భేటీ తర్వాత ఇప్పుడు మళ్లీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి తెలంగాణ రాజకీయాల్లో డిస్కషన్ మొదలైంది. ఢిల్లీ మద్యం స్కాంలో కవిత జైలుకెళ్లి.. మళ్లీ బెయిలుపై బయటకు వచ్చినప్పుడు జరిగిన విలీనం చర్చ.. ఇప్పుడు మళ్లీ జరుగుతోంది. కూతురు అరెస్టుతో సగం డీలా పడ్డ కేసీఆర్.. కొడుకు అరెస్టును చూడలేరని.. కాబట్టి విలీనం డీల్ గురించి మాట్లాడ్డానికి కేసీఆరే తన కొడుకు కేటీఆరును ఢిల్లీకి పంపారనేది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండింగులో ఉన్న టాక్. ఈ విలీనం రాజకీయం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.
పట్నం నరేందర్‌రెడ్డికి రిమాండ్
వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. లగచర్లలో అధికారులపై బీఆర్‌ఎస్ వర్గాలు దాడి చేసిన వ్యవహారంలో నరేందర్‌రెడ్డికి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన్ను కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అయితే, ఆ సమయంలో కొడంగల్ కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నరేందర్ రెడ్డిని తరలిస్తున్న కారును బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.