రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు ఏళ్లు పాలించి మెస్ ఛార్జీలు పెంచలేదన్న డిప్యూటీ సీఎం.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40శాతం మెస్ చార్జీలు పెంచామన్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి ఐదువేల కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు. పాఠశాలలు ప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫామ్స్ సరఫరా చేశామన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూజీ అని.. ఆయన నిర్ణయాలతోనే నేడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని స్పష్టం చేశారు. గుండు సూది కూడా ఉత్పత్తి చేయలేని దేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి.. రాకెట్లు తయారు చేసే స్థాయికి ఈ దేశాన్ని నెహ్రూ తీసుకువెళ్లారని కొనియాడారు. ప్రజలు జీవించడమే కాదు గౌరవప్రదమైన హక్కులు వారికి ఉండాలని మన తొలి ప్రధాని నెహ్రూ ఆలోచనలు చేశారన్నారు భట్టి విక్రమార్క.శాస్త్రీయ విద్య, ఉపాధి కల్పనకు ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థలను స్థాపించుకున్నామని గుర్తు చేశారు. ఆధునిక దేవాలయాలు పిలుచుకునే బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఆయన ఆలోచనలే అని భట్టి విక్రమార్క అన్నారు. కృష్ణానదిపై నాగార్జునసాగర్, గోదావరి నదిపై ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించి ఈ రాష్ట్రం మీదుగా రెండు జీవనదులు పారించేందుకు చాచా నెహ్రూ పునాదులు వేశారన్నారు. భిన్నత్వంలో ఏకత్వంతో ఈ దేశాన్ని నడిపారని, అమెరికా కూటమి ఇటు రష్యా కూటమికి దూరంగా అలీన విధానంతో సమదూరం పాటించి స్వతంత్రంగా వ్యవహరించి ప్రపంచదృష్టిని మన తొలి ప్రధాని ఆకర్షించారని ఉప ముఖ్యమంత్రి విద్యార్థులకు గుర్తు చేశారు.
చిన్నారులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి
హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడలోనిప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దశరథ్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు బాగా చదువుకొని.. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, చదువుకున్న పాఠశాలకు కూడా మంచిపేరు తీసుకురావాలని రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏర్పుల కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రశ్నించడం, నిలదీయడమే ప్రతిపక్షాల బాధ్యత : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ వంటి కార్యక్రమాలు నేటి సమాజంలో ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శాసన సభలో సభ్యులు లేవనెత్తే ప్రశ్నలు, సమాధానాలు.. ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షాల బాధ్యత అన్నారు. లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని గుర్తు చేశారు. సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాల్సి ఉంటుందన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చిల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన చిన్నారులను సీఎం అభినందించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయన్నారు. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో కృషి చేశారన్నారు.18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది అన్నారు. ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉందన్న రేవంత్.. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.
రైతులను ఇబ్బందులుపెట్టే మిల్లర్లపై చర్యలు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారి ప్రతీక్ జైన్ పై దాడి సంఘటనను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం నల్గొండలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ఐఏఎస్ అధికారిపై దాడి చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కలెక్టర్ ను పిలిపించి దాడికి పాల్పడ్డారని, ఇది దేశంలోనే ఘోరమైన సంఘటన అని అన్నారు. కాలేశ్వరం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ వంటి అవసరం లేని ప్రాజెక్టులకు భూసేకరణ జరిగినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగినా ప్రభుత్వాన్ని బ్రతిమిలాడారే తప్ప ఏ రోజు దాడులకు పాల్పడలేదని, అలాంటిది ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ పై దాడికి దిగడం దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. ఈ సంఘటన వెనక ఎంత పెద్దవారు ఉన్నా క్షమించేది లేదని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని, ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని ఆయన అన్నారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న మిల్లర్స్ పైన ఎస్మా వంటి కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించినప్పటికి కొందరు మిల్లర్లు కావాలని రైతులను ఇబ్బందులకు గురిచేయడం పట్ల ఆగ్రహంవ్యక్తం చేశారు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మిల్లర్లు రైతులకు సహకరించకుండా ఇబ్బందులు పెడుతున్నారని, అలాంటి వారిపై అవసరమైతే ఎస్మా కేసులు తప్పవని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేవలం 10 శాతం బ్యాంకు గ్యారెంటితో ప్రభుత్వం ధాన్యాన్ని మీల్లులకు కేటాయిస్తున్నదని, అంతేకాక మిల్లింగ్ చార్జీలు పెంచడం వంటి అన్ని రకాల సహాయ, సహకారాలను మిల్లర్లకు అందిస్తున్నదని, అందువల్ల ప్రభుత్వం ఇస్తున్న చయూతను దృష్టిలో ఉంచుకొని, మిల్లర్లు ముందుకు వచ్చి రైతులకు, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
జిల్లాలో ఐకెపి ద్వారా దాదాపు 60 – 70% ధాన్యం కొనుగోళ్లను పూర్తిచేశామని చెప్పిన మంత్రి. కలెక్టర్ తో సహా అధికారులందరు అదే పనిలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. కొందరు మిల్లర్ల వల్ల కొన్ని చోట్ల కొంత ఆలస్యం జరగడంతో రైతులు బాధపడ్డారని, మిల్లర్లు చేసిన దుర్మార్గమైన పనికి మంత్రిగా తాను చింతిస్తున్నానన్నారు. రైతులను గోసపెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఒక వారంలోనే ధాన్యం మొత్తం కొనుగోలు చేసేలా యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లను చేపట్టామని చెప్పారు.
తెలంగాణాలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రూపాయి ఫాయిదాలేదన్న మంత్రి.. పొద్దున్న లేస్తే గల్లీ రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రానికి చేసిన మేలేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో ఆలస్యం జరిగి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. దాని పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వండి కానీ, బురదజల్లే ప్రయత్నం చెయ్యకండని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సివిల్ సప్లయి శాఖను నిర్వీర్యం చేసి, దాదాపు 11 వేల కోట్ల రూపాయల లెక్కలు లేకుండాపోతే, దానివల్ల మిల్లర్లు కొన్ని షరతులు పెట్టడం వల్ల, ప్రజాధనం వృధా కావద్దని ఉద్దేశ్యంతో చర్యలు చేపట్టడం వల్ల కాస్త ఆలస్యం జరిగిందని.. ఇకపై ఒక్కరోజు కూడా ఆలస్యం జరగదని మంత్రి చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుందని చెప్పిన ఆయన అధికారం పోయి, కేసులు మీద పడుతుంటే తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తో అధికారుల మీద దౌర్జన్యాలకు దిగే స్థాయికి వచ్చారని ఆయన మండిపడ్డారు. కలెక్టర్ ఇతర అధికారులపై దాడిచేసిన వారు ఎంతటివారైన చర్యలు తప్పవని చెప్పిన మంత్రి.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పారు.
నల్గొం జిల్లాలోనే అత్యధికమంది టెలిఫోన్ ట్యాపింగ్ దొంగలున్నారని.. విచారణ పూర్తయితే వారు ఊచలు లెక్కించక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రభాకర్ రావు బయటికొస్తే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలందరి బాగోతాలు బయటపడతయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 70 శాతం మంది జైలు లోనే ఉన్నారన్న మంత్రి. ధరణి ఈ నెల 29 నుంచి ఎన్.ఐ.సి కంట్రోల్ కి పోతుందని, ధరణి స్కామ్‌లో అందులో అమోయ్ కుమార్ తో పాటు ఇంకెంతమంది ఐ.ఏ.ఎస్ ఆఫీసర్లు పోతారో తెలీయదని ఆయన అన్నారు.
ఈ సమీక్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం హరీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, జిల్లా సహకార శాఖ అధికారి పత్యా నాయక్, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు .
సీఐఎస్ఎఫ్ లో తొలి మహిళా బెటాలియన్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో అందరూ మహిళలే ఉండేలా ప్రత్యేక మహిళా బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మహిళలకు సాధికారత కల్పించడంతో పాటు దేశ భద్రతలో మహిళామణుల పాత్ర పెంచాలనే సంకల్పంతో హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ లో మహిళల భాగస్వామ్యం 7 శాతం మాత్రమే ఉంది. తాజాగా మహిళా బెటాలియన్నుఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో మహిళల భాగస్వామ్యం పెరగనుంది. కొత్త బెటాలియన్ కు సత్వరం నియామకాలు జరపడం, ఆ సేనాదళానికి అవసరమైన శిక్షణను ఇవ్వడం, బెటాలియన్ కు ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన చోటును ఎంపిక చేయడం వంటి సన్నాహాలను సీఐఎస్ఎఫ్ ప్రధాన కేంద్రం ఇప్పటికే మొదలుపెట్టింది. కమెండోలుగా ఉంటూ వీఐపీల భద్రతకు సంబంధించిన విధుల నిర్వహణకు, అంతేకాకుండా విమానాశ్రయాలలోనూ, ఢిల్లీ మెట్రో రైల్ కు సంబంధించి.. ఇలా బహుముఖ భూమికలను నిర్వర్తించడానికి సమర్ధత కలిగిన ఒక విశిష్ట బెటాలియన్ ను ఏర్పాటు చేయడానికంటూ ప్రత్యేకంగా ఓ శిక్షణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఐఎస్ఎఫ్ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సీఐఎస్ఎఫ్ లో అందరూ మహిళలే సభ్యులుగా ఉండే సేనాదళాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కార్యరూపానికి శ్రీకారంచుట్టారు.
జౌళిశాఖపై తుమ్మల సమీక్ష
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జౌళిశాఖపై సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వశాఖలు, కార్పోరేషన్ల నుండి వారికి అవసరమైన వస్త్రాల కోసం వెంటనే ఆర్డర్లు తెప్పించుకోవాలని టెస్కో నుండి సంఘాల ద్వారా వస్త్రాల ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాలని టెస్కో ఎండి శైలజా రామయ్యర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సప్లై త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే 96.03 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి కోసం సంఘాలకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, సంఘాల నుండి కొనుగోలు చేసి సంబంధిత శాఖలకు సప్లై చేశామన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించి వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా జీవో 18 ద్వారా వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్లకి యార్న్ డిపో మంజూరి చేసిన విషయాన్ని మంత్రి మరోసారి గుర్తుచేశారు. ఈ యార్న్ డిపోకి 50 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు.
నిజమైన కమ్యూనిస్టు నేత గుమ్మడి నర్సయ్య
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్‌పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి.
ఇదే క్రమంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రికి కంటి పరీక్షల కోసం ఆయన వచ్చారు. అక్కడ అందరితోపాటే ఓపీ చీటి తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక పరీక్ష చేయించుకున్నారు. నేడు వార్డుమెంబర్, సర్పంచ్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య… ఆదర్శంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు. వర్తమాన రాజకీయ నాయకుల్లో గుమ్మడి జీవన శైలి స్పూర్తి దాయకమని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
లగచర్లలో గులాబీ గూండాల కుట్ర – మంత్రి పొంగులేటి
రైతులను నష్టపెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదని, వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచిపద్దతి కాదని, లగచర్ల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందన్నారు.
ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లు గానే ..రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని హైదరాబాద్ లో హెచ్చరించారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్‌గా ఉన్నకలెక్టర్‌పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని, రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని, గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్ధం చేసుకోవాలని మంత్రి కోరారు. అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారన్నారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం అధికారం వెలగబెట్టిననాడు ఇదే పద్దతి చేశారా అని ప్రశ్నించారు.
ఏం తప్పుచేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని మంత్రి గుర్తు చేశారు. మల్లన్నసాగర్ లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారని, పిల్లా, పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగతి మరిచారా అన్నారు. ఇప్పుడు ఎగిసి పడుతున్న కేటీఆర్.. తన నియోజకవర్గం సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి మరిచిపోయారా? లగచర్లలో ఆ పరిస్ధితి లేదు కదా అని మంత్రి పొంగులేటి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం ..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో కొంత జాప్యం జరిగితే తొందరపాటుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
అంతమాత్రాన బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనడం అవివేకమని కేంద్రమంత్రి విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి.. అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని, కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదన్నారు. వారి హయాంలో ప్రధాని తెలంగాణకు వచ్చి ప్రాజెక్టులు ప్రారంభిస్తే బయటకు రాని కేసీఆర్, కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. కలెక్టర్ మీద దాడి తప్పని, అయితే గ్రామస్తుల మీద అక్రమ కేసులు పెట్టడం కూడా సరికాదని కిషన్ రెడ్డి అన్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన. ఆయన తన ప్రజలతో మాట్లాడాలని హితవు పలికారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, ఒక్క అవినీతి, కుంభకోణం ఆరోపణ లేకుండా బీజేపీ, శివసేన ప్రభుత్వ పాలన సాగిందని కేంద్రమంత్రి వెల్లడించారు.
ఇందిరమ్మ పాలన పేరుతో అక్రమ అరెస్టులా… హరీశరావు
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద, సోకాల్డ్ ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మా భూముల మాకు కావాలని ఆ ప్రాంత ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారని, అక్కడ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గూండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఓటు వేసి గెలిపిస్తే బాగు పడతామని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అనంతరం చర్లపల్లి జైల్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
లగచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా వ్యవహరిస్తున్న సిఎం కట్టుబట్టలతో ఊళ్లు వదిలి పారిపోయేలా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెబుతున్నరని, ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
హరీశరావు కామెంట్స్…
రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అంటున్నడు. అశోక్ నగర్ లో విద్యార్థులు తిరగబడితే బీఆర్ఎస్ కుట్ర అంటరు. రైతులు రోడ్ల మీదకు వస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు
పోలీసులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు. గురుకుల విద్యార్థులు నిరసన చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు. చివరకు సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులు పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందంటరు. ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నయో వారికి అండదండగా ఉండటం ప్రతిపక్షం బాధ్యత
పీడిత వర్గాలకు అండదండగా నిలబడటమే మా బాధ్యత. మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, నన్నో, కేటీఆర్ నో, మా ఎమ్మెల్యేలను అరెస్టు చేయండి కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టులు చేయడం సరికాదు. మా భూమి మాకు కావాలి అని పోరాటం చేస్తే వేధిస్తరా. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా మీ మోసపూరిత వైఖరి మీద బీఆర్ఎస్ చేసే పోరాటం ఆగదు.
ఇదేం ప్రజాస్వామ్యం. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం ఇస్తున్న అని చెప్పినవు. ఆరోజు మల్లన్న సాగర్ లో రెండు రోజులు నిరాహార దీక్ష చేసినవు. నీకు రక్షణ ఇచ్చినం కదా, నిన్ను అడ్డుకోలేదు, అరెస్ట్ చేయలేదు.
మా లీడర్ ఆఫ్ అపోజిషన్ మా మధుసూదనాచారి లగచర్లకు వెళ్తే అడ్డుకున్నవు. ఆర్ఎస్ ప్రవీణ్, కార్తీక్ రెడ్డి లను అడ్డుకున్నవు. ఎంపీ అరుణ వెళ్లకుండా అడ్డుకున్నవు.
తొమ్మిది నెలల గర్బిణీ చాతి మీద తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు. ఇదేనా మీరు చేసే పాలన? ఇదేనా ప్రజాపాలన? అక్రమంగా అరెస్టు చేసి నరేందర్ రెడ్డి, కేటీఆర్ మీద కేసులు పెడుతవు కావొచ్చు
నిన్ను గద్దె దించడం మాత్రం ప్రజలు మరిచిపోరు. హైదరాబాద్ లో 14వేల ఎకరాల్లో భూమి తయారు చేసిండు కేసీఆర్. ఫార్మాసిటీ కోసం ఉన్న భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తడట. పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నడు. ఆనాడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నేడు రాష్ట్రంలో కనిపిస్తున్నది
ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?
ఫార్మా సిటీ పెట్టాలంటే గత ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాల్లో పెట్టు. కొడంగల్, జహీరాబాద్ లలో పార్మాసిటీ భూముల సేకరణ నిర్ణయం ఉపసంహరించుకో. నీ ప్రాధాన్యం అదానీ, నీ ప్రాధాన్యం నీ అల్లుల్లు
దళిత, గిరిజన, పేదల పక్షాన మేం పోరాటం చేస్తం. బీఆర్ఎస్ పార్టీ నిలబడుతది. సమాధానం చెప్పలేక కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నవు
నరేందర్ రెడ్డిని జైలులో పెట్టి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ ఇంతేనా రేవంత్ రెడ్డి. బడా ఫార్మా కంపెనీల మీద, నీ అల్లుడి మీద ప్రేమ ఉంది తప్ప రైతులు, గిరిజనుల మీద లేదు. బడా బాబులకు భూములు కట్టబెడుతరా
ముఖ్యమంత్రి ఉన్నది ఇందుకేనా?