రైతులను నష్టపెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదని, వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచిపద్దతి కాదని, లగచర్ల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందన్నారు.
ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లు గానే ..రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని హైదరాబాద్ లో హెచ్చరించారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్గా ఉన్నకలెక్టర్పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని, రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని, గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్ధం చేసుకోవాలని మంత్రి కోరారు. అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారన్నారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం అధికారం వెలగబెట్టిననాడు ఇదే పద్దతి చేశారా అని ప్రశ్నించారు.
ఏం తప్పుచేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని మంత్రి గుర్తు చేశారు. మల్లన్నసాగర్ లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారని, పిల్లా, పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగతి మరిచారా అన్నారు. ఇప్పుడు ఎగిసి పడుతున్న కేటీఆర్.. తన నియోజకవర్గం సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి మరిచిపోయారా? లగచర్లలో ఆ పరిస్ధితి లేదు కదా అని మంత్రి పొంగులేటి అన్నారు.