33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

జమిలికి బిజేపీ సయ్… మరి విపక్షాలు…?

  • వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు బీజేపి సన్నాహాలు
  •  ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చకు బిల్లు ?

ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. అఖండ భారత్ సాధనకు ప్రస్తుతం మోడీ ప్రభుత్వం దీనిని  తారక మంత్రంలా  భావిస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశ పెట్టి ఓకే చేయించుకుని సాధ్యమైనంత త్వరగా జమిలి ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపి మేథావుల ఆలోచన.  ఇదే దిశగా మోడీ ప్రభుత్వం పావులు కదుపుతోంది కూడా.. అయితే పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ అదానీ ఎపిసోడ్ తో వ్యూహాత్మకంగా అడ్డుకుంటోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్  అమలుకు ఎన్నో రాజ్యాంగ సవరణలు చేయాల్సిఉంది.దీనికోసం పార్లమెంటు ఉభయ సభల్లోనూ కనీసం ఆరు బిల్లులు మూడింటా రెండొంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది.అయితే ఉభయ సభల్లోనూ బీజేపి కూటమి ప్రస్తుతం నామమాత్రపు  మెజారిటీతో నడుస్తోంది. కాబట్టి ప్రస్తుత తరుణంలో  ఈ బిల్లు ఆమోదం కాస్త కష్టమే.

 బిల్లు ఆమోదం సందేహమే

వన్ నేషన్ కాన్సెప్ట్ కు ఆమోద ముద్ర వేయించుకోవాలంటే కీలక రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. ఏ రాజ్యాంగ సవరణ బిల్లు అయినా  పార్లెమెంటు ఉభయ సభల్లోనూ మూడింటారెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. పైగా దాదాపు కీలకమైన ఆరు రాజ్యాంగ సవరణ బిల్లులను సభ్యులు ఆమోదించాలి.అయితే మూడింటా రెండొంతుల మెజారిటీకి 164 మంది మద్దతు అవసరం.కానీ రాజ్యసభలో ఎన్డీఏకి 112 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు.అలాగే లోక్ సభలో ఎన్డీఏకి 292 మంది  ఎంపీలున్నారు. మూడింటా రెండొంతుల మెజారిటీకి 364మంది ఎంపీల మద్దతు అవసరం.  మహారాష్ట్ర ఎన్నికల్లో విజయంతో బీజేపి జమిలి ఎన్నికలకు జై కొట్టాలని భావిస్తోంది. ఇప్పుడు బిల్లు ఆమోదం కష్టమే అయినా తమ అజెండాను బహిర్గత పరచాలన్నది బీజేపి లక్ష్యంగా కనిపిస్తోంది.

బీజేపి ఇప్పడు దాదాపు 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కానీ కీలక బిల్లుల ఆమోదంలో మోడీ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. మిత్ర పక్షాల సహకారంతో తమ ఎజెండా అమలు కష్టం కాబట్టి సాధ్యమైనంత త్వరగా మధ్యంతర ఎన్నికలకు వెళ్లి దేశవ్యాప్తంగా  మరింత బలమైన మెజారిటీతో గద్దె నెక్కాలన్నది బీజేపి పెద్దల  ఉద్దేశంకావొచ్చు.

ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు..

ఒకే సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిపేందుకు అనువైన యంత్ర సామాగ్రి కానీ, సిబ్బంది కానీ , భద్రతా బలగాలు గానీ, మానవ వనరులు గానీ మన దగ్గర లేవు. పైగా ప్రజావ్యతిరేక విధానాలను అనుసరించే ప్రభుత్వాలను తక్షణం గద్దె దింపడం జమిలి ఎన్నికల వల్ల సాధ్యం కాదు. ఈ నేపధ్యంలో ఈ బిల్లు ఆమోదానికి ఎన్డీఏ ఎలాంటి ఎత్తుగడలు అనుసరిస్తుందన్నది చూడాలి. ఎన్నికల సంస్కరణల్లో ఈ విప్లవాత్మక మార్పులు చేపట్డడానికి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశాల్లో కాకపోతే వచ్చే సమావేశాలలోనైనా దీనిని చేపట్టాలని కృత నిశ్చయంతో అడుగులేస్తోంది.

వ్యతిరేకిస్తున్న విపక్షాలు

బీజేపి ఆలోచనలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రజాస్వామ్యానికి విఘాతమని, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని అంటున్నాయి.  ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం మన దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 58 ప్రాంతీయపార్టీలు ఉన్నాయి.  బీజేపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ, నేషనల్ పీపుల్స్ పార్టీ  జాతీయ పార్టీలే అయినా బీజేపి, కాంగ్రెస్ మినహా చెప్పుకోదగ్గ జాతీయ స్ధాయి పార్టీలేం లేవు.

ఒకే దేశం, ఒకే ఎన్నిక వినడానికి బానే ఉన్నా ప్రాంతీయ పార్టీలు, కూటములు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధానం అమలు చేయడం కష్టం. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ప్రశ్నార్ధకం. అన్ని ప్రాంతీయ పార్టీలు ఏదో ఓ జాతీయపార్టీ గొడుకు కిందకు రావాల్సిన పరిస్థితి. కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు. ఒకవేళ అలాగే అనుకున్నా జాతీయ పార్టీ కేంద్రంలో ఓడిపోయి, రాష్ట్రాల్లో దాని కూటమి అధికారంలోకి వస్తే  పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ అంచనా ప్రకారం బీజేపి ఇప్పుడు 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే, కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాల్లో నేరుగా  అధికారంలో మరో రెండు రాష్ట్రాల్లో సంకీర్ణ భాగస్వామిగా అధికారంలో ఉంది.  మరో లెక్కలో చెప్పాలంటే రాష్ట్రాల విస్తీర్ణాన్ని బట్టి లెక్కెస్తే దేశంలో 57 శాతం భూభాగం బీజేపి పాలిత రాష్ట్రాల  అధీనంలో ఉంటే  43 శాతం విపక్షాల అధీనంలో ఉంది.

ఇండియా కూటమి పూర్తి వ్యతిరేకం

ప్రాంతీయ పార్టీల వ్యవస్థ మన దగ్గర బలంగా ఉంది. ఇందులో త్రుణమూల్, డిఎంకే, సమాజవాదీ పార్టీ, ఇండియన్ ముస్లిం లీగ్, టీడీపీ, కొంచెం ఎంపీ సీట్ల పరంగా బలంగా ఉన్న పార్టీలు. టీడీపీ మినహా అన్ని పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములే. వన్ నేషన్ థియరీని ఇండియా  కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ కూటమిలో దాదాపు 12 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.

ప్రధాన పార్టీ అయిన  కాంగ్రెస్  ఈ  థియరీకి బద్ధ వ్యతిరేకి.  మన దేశానికి  ఇలాంటి ప్రతిపాదనలు సూట్ కావని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా అన్నారు. ఇష్టం లేని, అనైతిక  పాలనను అందించే ప్రభుత్వాలను గద్దెదించే అవకాశం దీని వల్ల ఉండదని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం ఐదు  రాష్ట్రాల్లో మాత్రమే. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లో పూర్తిస్థాయిలో అధికారంలో ఉండగా, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి.

త్రుణమూల్, డిఎంకే నో

పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న త్రుణమూల్ కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకం. ఇది ప్రాంతీయ పార్టీల మనుగడను  దెబ్బ తీసే ప్రతిపాదన అని ఆమె అన్నారు. కేంద్రంలో సమర్ధమైన పార్టీ  అధికారంలో లేకపోతే, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నరాష్ట్రాల పరిస్థితి ఏంటో ఆలోచించాలని మమత ప్రశ్నించారు. అలాగే డిఎంకే కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న తమిళనాడు లో కూడా స్టాలిన్ దీనికి వ్యతిరేకమే. దశల వారీగా  లేదా విడతల వారీగా ఎన్నికలు జరిగే మన దేశంలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం కష్టమని అన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం  అన్నది ఆయన వాదన. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామి కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఆ పార్టీ సుముఖమనే అనుకోవాలి.

బిల్లు ఆమోదానికి బీజేపి ఏం చేస్తుంది?

వన్ నేషన్ వన్ ఎలక్షన్  బీజేపి ఆలోచనా విధానమే అయినా… ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపికి సొంతంగా   మెజారిటీ లేదు. ఎన్డీఏ మిత్రుల సహకారం తప్పనిసరి. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరిపి దానిని ఒక కొలిక్కి తేవాలని భావిస్తుండొచ్చు. మిత్ర పక్షాల సహకారం సాధ్యం కాకపోతే మధ్యంతర ఎన్నికలకు వెళ్లి మరోసారి బీజేపి పూర్తి స్థాయి లో మెజారిటీ సాధించి అప్పుడీ ప్రక్రియను  అమలు చేయవచ్చు. జమిలి ఎన్నికలపై పార్టీల అభిప్రాయాలను కోరినప్పుడు 47 పార్టీలనుంచి కేంద్రానికి స్పందన వచ్చింది. అందులో 32 పార్టీలు ఈ ప్రతిపాదనను సమర్ధించాయి.కేవలం 15 పార్టీలు వ్యతిరేకించాయి. కానీ వ్యతిరేకించిన పార్టీలు ఓటుబ్యాంకు, సీట్లపరంగా బలమైనవి కాగా సమర్ధించిన 32 పార్టీలు ఎన్నికల్లోపెద్దగా ప్రభావం చూపలేనివే.. మరి ఈ చిక్కు ముడిని కేంద్రం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com