32.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

పౌరసత్వంపై 15 ఏళ్ల పోరాటం

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం 15 ఏళ్లుగా సాగుతోంది. తాజాగా హైకోర్టు తీర్పుతో వివాదం కొలిక్కి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ సుదీర్ఘ పోరాటం చేశారు.

2009 నుంచి ఇప్పటి వరకు ఉప ఎన్నికతో కలుపుకొని ఐదుసార్లు ఆది శీను పోటీ చేయగా నాలుగు సార్లు ఓటమి చెందారు. నాలుగుసార్లు చెన్నమనేని, ఆది ప్రత్యర్థులు కావడం గమనార్హం. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెన్నమనేని బీఆర్ ఎస్ తరపున పోటీచేయగా ఆది శీను ఒకసారి బిజెపి నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.

చెన్నమనేని రమేష్ 2008లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయగా… 2009లో అనుమతి వచ్చింది. అయితే నిబందనల ప్రకారం ఏడాది కాలం పాటు దేశంలో నివసించిన తర్వాత పౌరసత్వం ఇవ్వాల్సి ఉంటుందని కేవలం 96 రోజులు దేశంలో ఉండి తప్పుడు ద్రువపత్రాలతో పౌరసత్వం పొందారని ఆది శ్రీనివాస్‌ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

దీనిపై కేంద్రం నోటీసులు ఇవ్వగా చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించి…ఉపశమనం పొందారు. అయితే చెన్నమనేని పౌరసత్వంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2017లో ఆయన పౌరసత్వం రద్దు చేసింది. 2018లో చెన్నమనేని మళ్లీ హైకోర్టును వేడుకోగా పౌరసత్వం చట్టాన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది.  పూర్తి స్థాయిలో విచారణ జరిపిన కేంద్రం పౌరసత్వం రద్దు చేస్తూ 2019లో ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించగా పౌరసత్వం రద్దును సమర్థిస్తూ తాజాగా తీర్పు వెలువడింది.

హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం రికార్డును అందజేసింది. మరోవైపు చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు మెమో దాఖలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

ప్రభుత్వం నుంచి న్యాయస్థానాలకు చేరిన వివాదం దశాబ్దంన్నర కాలంగా విచారణ జరిగింది. మధ్యలో రాష్ట్రంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నపుడు కేసు విచారణలో తాత్సారం జరిగిందనే విమర్శలు కూడా వచ్చాయి.

ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తవడంతో చెన్నమనేని రమేష్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని తేల్చి చెప్పిన హైకోర్టు.. అతనికి రూ. 30 లక్షల జరిమానా విధించింది. విచారణ సందర్భంగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  తప్పుడు సమాచారం, తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చారంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నెల రోజుల్లో జరిమానా మొత్తం చెల్లించాలని ఆదేశించింది.

హైకోర్టు తీర్పును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వాగతించారు. 15 ఏళ్ల న్యాయ పోరాటం విజయం సాధించిందన్నారు.

హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తాజా పరిణామాలు పరిశీలిస్తే…. చెన్నమనేని రమేష్ కు గత ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో చల్మెడ ఆనందరావుకు టికెట్ దక్కింది. బిజెపి నుంచి మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు చెన్నమనేని వికాస్ పోటీచేశాడు. కాంగ్రెస్ నుంచి ఆది శీను తలపడ్డారు.

ప్రత్యర్థులు ఇద్దరు వెలమ సామాజికవర్గం కావడం… ఆది శీను బిసి కావడం…కాంగ్రెస్ గాలి కొంత కలిసివచ్చింది. అయితే ఎమ్మెల్యే పదవి పోయి… తీర్పు కూడా వ్యతిరేకంగా రావడం చెన్నమనేని రమేష్ ను నిరాశ పరిస్తే… ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభుత్వ విప్ పదవి నిర్వహిస్తున్న తరుణంలో 15 ఏళ్ల పౌరసత్వ పోరాటంలో ఆది శీను గెలవటం ఆయన అనుచరుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com