-
అంగట్లో సరుకుల్లా అమ్ముతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
-
రూ.15వేలు ఉంటే చాలు.. ఎవరికైనా బర్త్ సర్టిఫికెట్లు
-
టాస్క్‌ఫోర్స్ ఆపరేషన్‌లో బట్టబయలు
విదేశీయులకు అడ్డాగా హైదరాబాద్ మారిందన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రధానంగా మన దాయాది దేశం పాకిస్తాన్, పక్క దేశాలైన బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ స్థిరంగా నివసిస్తున్నారన్న ఆధారాలు అనేక సార్లు బయట పడ్డాయి. ఇప్పుడు దేశ సరిహద్దుల్లో కశ్మీర్‌లో ఉగ్రవాద ముష్కరుల దాడి నేపథ్యంలో దేశ మంతా చొరబాట్లు, ఉగ్రవాదంపై చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి బాగోతం బట్ట బయలయ్యింది. విదేశీయులకు దర్జాగా బర్త్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్న వ్యవహారం బయట పడింది.
దేశం ఏమైపోతే మాకేంటి? ఎవరు ఎవరిని చంపేస్తే మాకేంటి? అన్నట్లుగా తయారయ్యారు కొందరు. డబ్బుల కోసం బరితెగిస్తున్నారు. సర్టిఫికెట్లను అంగట్లో సరుకుల మాదిరిగా అమ్మేస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలియకుండానే.. కిందిస్థాయిలో వాళ్ల పని వాళ్లు చేసేస్తున్నారు. చెప్పుకునేందుకు, మాట్లాడుకునేందుకు చిన్న అంశంగానే అనిపిస్తున్నా.. ఇలాంటి పరిణామాలు దేశ భద్రతకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. వ్యవస్థలో నిండిపోయిన అవినీతి, బాధ్యతా రాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్ నార్సింగ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సుధీర్ కుమార్, మహ్మద్ ముఖీబ్, సాయి కిరణ్, రజనీ కాంత్ ఎవరికి పడితే వాళ్లకు బర్త్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆపరేషన్‌లో ఈ బండారం బయటపడింది. ఈ ఆపరేషన్‌లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి, హైదరాబాద్‌లో స్థానికులను పెళ్లిల్లు కూడా చేసుకున్న ఇద్దరి ఆనవాళ్లు తెలిశాయి.
హసిబుల్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. సరిహద్దుల్లో కొందరికి రూ.25వేలు చెల్లించి ఢాకా నుంచి కోల్‌కతా చేరుకున్నాడు. జోవన్ చౌదరి అనే నకిలీ పేరుతో కోల్‌కతాలో ఆధార్ కార్డు సంపాదించాడు. అక్కడ కరాటే కోచ్‌గా పనిచేస్తూ.. హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన జయా చౌదరితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తాను కోల్‌కతాకు చెందిన వాడినంటూ నమ్మించి 2023లె జయా చౌదరిని పెళ్లి చేసుకున్నాడు. మలక్‌పేట్‌కు మకాం మార్చాడు. నార్సింగి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుధీకర్ కుమార్‌కు రూ.15వేలు ఇచ్చి నకిలీ బర్త్ సర్టిఫికెట్ సంపాదించాడు. ఆ తర్వాత ఓటరు కార్డు కూడా తీసుకున్నాడు. తన మాదిరిగానే బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తోన్న రోహిన్ షాకు కూడా నార్సింగి మున్సిపాలిటీ నుంచి నకిలీ ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్ ఇప్పించాడు. ఆ తర్వాత ఇద్దరూ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ వీళ్ల దరఖాస్తులపై అనుమానం రావడంతో.. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. నార్సింగి మున్సిపాలిటీకి మఫ్టీలో వెళ్లి.. నేరుగా సుధీర్ కుమార్‌నే నకిలీ బర్త్ సర్టిఫికెట్ కావాలని అడిగారు. వెంటనే సుధీర్ అంగీకరించడంతో అక్కడ సాగుతున్న బండారం బయటపడింది. దీంతో, అక్కడ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సుధీర్ కుమార్, మహ్మద్ ముఖీబ్, సాయి కిరణ్, రజనీ కాంత్‌తో పాటు..బంగ్లాదేశీయులు హసిబుక్, రోహన్ షాను కూడా అరెస్ట్ చేశారు.