25.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

టూరిజంని కుప్పకూల్చిన నెత్తుటి చారిక !!

  • పెహల్గాం దాడితో కుదేలైన కశ్మీర్ టూరిజం
  • దాదాపు టూరిస్టులంతా వెళిపోవడంతో ఖాళీ
  • 62శాతం టూర్ కాన్సిలేషన్స్
  • ప్రయాణీకులు లేక పలు విమానాల రద్దు
  • శ్రీనగర్ తమ టూరిస్టు ప్లాన్ లో లేదంటున్న ట్రావెలర్లు
  • ఇప్పట్లో ఇక్కడకు రాబోమంటున్న టూరిస్టులు
  • హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత..
  • తమ జీవనో పాథి దెబ్బతిందని వారి ఆవేదన
  • ఇన్నాళ్లూ టూరిస్టుల జోలికి రాని ఉగ్రవాదులు
  • తొలిసారి మోడీ ప్రణాళికపై దారుణమైన దెబ్బ
  • వెలవెలబోతున్న సుందర ప్రాంతం..

పెహల్గాం లో ఉగ్రదాడి నేపధ్యంలో కశ్మీర్ టూరిజం పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ఆ ప్రాంతానికి ఈ వేసవిలో సరదగా ట్రిప్ ప్లాన్ చేసుకున్న వారంతా ఇప్పుడు తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. కశ్మీర్ టూర్ కు ఏర్పాట్లు చేసుకున్న వారిలో సగటున పదికి ఆరుకుటుంబాలు తమ ట్రిప్ ను కాన్సిల్‌ చేసుకుంటున్నాయి. ఈ వేసవి ట్రిప్ కోసం గత ఏడాది మే, డిసంబర్ మధ్య కాలంలో శ్రీనగర్ టూర్ ప్లాన్ చేసుకున్న 6,807 మంది టూరిస్టులలో 62 శాతం మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.
ఢిల్లీ -శ్రీనగర్ మధ్య విమానం కేవలం ఇద్దరంటే ఇద్దరు ప్రయాణికులతో నడిచిందంటేనే కశ్మీర్ టూర్ పై ప్రయాణికుల్లో ఎంత భయం గూడుకట్టుకుని ఉందో అర్ధం చేసుకోవచ్చు.

పెహల్గాం దాడి తో కొందరు శ్రీనగర్ తమ టూరిస్టు ప్లాన్ లోనుంచి తొలగించేశామని అంటుంటే మరికొందరు మరో మూడు, నాలుగేళ్ల తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి రావాలో వద్దో ప్లాన్ చేసుకుంటామని అంటున్నారు. ఉగ్రదాడి శ్రీనగర్ టూరిజం రంగంపై సమీప భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బ వేసింది.కశ్మీర్ కు వచ్చే వారిలో పెద్ద సంఖ్యలో హిందూయాత్రీకులు కూడా ఉన్నారు. లక్షల్లో భక్తులు అమరనాథ్ యాత్రకు, వైష్ణో దేవి ఆలయ దర్శనానికి పోటెత్తుతుంటారు.వీరిలో ఐదు లక్షల మంది విదేశీ టూరిస్టులు అమరనాథ్ యాత్రకు వస్తే 94 లక్షల మంది వైష్ణో దేవీ ఆలయదర్శనానికి వస్తారు.

ఒక్క దాడితో అంతా నేల పాలు…

ఏళ్ల తరబడి తమ శ్రమ పెట్టుబడిగా కశ్మీర్ ను ఒక అందమైన టూరిస్టు గమ్యంగా నిర్మించుకుంటే ఆ శ్రమ అంతా ఒక్క దాడితో వృథా అయిపోయిందని టూరిస్టు ఆపరేటర్లు వాపోతున్నారు. టూరిస్టులలో ఈ విశ్వాసం మళ్లీ పాదుకొల్పడం ఇప్పట్లో సాధ్యం కాదని వారు నీరసించిపోతున్నారు.

నిర్మానుష్యంగా, కళ తప్పిన దాల్ లేక్ పరిసరాలు…

శ్రీనగర్ దాల్ లేక్ ఇప్పుడు వెలవెలబోయి కనిపిస్తోంది. టూరిస్టులు లేక, బేరాలు లేక గూటి పడవలన్నీ(షికారాలు)ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 2024లో రెండు కోట్ల 30 లక్షలమంది కశ్మీర్ సందర్శించారు. ఈ ఏడాది ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంతా భావించారు. అయితే పెహల్గాంలో ఉగ్రదాడితో పరిస్థితి అంతా తల్లకిందులైపోయింది.టూరిస్టులంతా ఒక్కొక్కరుగా డ్రాప్ అయిపోతున్నారు. గత పాతికేళ్లలో భారత నియంత్రిత కశ్మీర్లో ఇంత దారుణమైన దాడి ఎప్పుడూ జరగలేదు. ఈనేపధ్యంలో భారత, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నందున భూతల స్వర్గం కశ్మీర్ ను చూసేందుకు ఎవరూ సాహసించడం లేదు. కశ్మీర్ ను భారత ప్రభుత్వం నుంచి విడిపడాలని కోరుతున్న ఉగ్రవాదులు టూరిస్టుల జోలికి ఇన్నాళ్లూ పోలేదు. కానీ తాజా దాడితో టూరిస్టులకు కూడా అక్కడ రక్షణ ఉండదన్న భయాలు పెరుగుతున్నాయి. లిద్దార్ నది ఒడ్డున ఉన్న హోటళ్లన్నీ ఇప్పుడు మూసేశారు. ఈ ప్రాంతం అత్యద్భుతమైన కశ్మీరీ సోయగాలను చూసేందుకు అనువైన్ స్పాట్ గా చెబుతుంటారు. దాడి నేపధ్యంలో షాపులు, ఇతర చిరు వ్యాపారులు కూడా కనిపించకుండా పోయారు.

దశాబ్దాలుగా లక్షలాది మంది టూరిస్టులను ఆకర్షించిన ఈప్రాంతం ఒక్క రాత్రిలో బోసిపోయి స్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. వీధులు,బిజీ కూడళ్లు ,అన్ని టూరిస్టు స్పాట్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రెండు రోజుల ముందు వరకూ తనకు క్షణం కూడా తీరిక లేకుండా కస్టమర్ల తాకిడి ఉండేదని, ఎంక్వయిరీలు, రాకపోకలతో తమ రెస్టారెంట్ రద్దీగా ఉండేదని, కానీ ఒక్కదాడితో అంతా తల్లకిందులైపోయిందని స్థానికంగా ఉండే ఓ రెస్టారెంట్ ఓనర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఇక్కడ టూరిజం రంగం కోలుకోవడం కల్లేనన్న అనుమానాలు అతడు వ్యక్తం చేశాడు.ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదన్నది ఆ వ్యాపారి అంచనా. మరో రెస్టారెంట్ యజమానిది కూడా ఇలాంటి ఆవేదనే. నిన్న మొన్నటి వరకూ విపరీతమైన టూరిస్టుల తాకిడితో రద్దగా ఉన్న తన హోటల్‌ ఇప్పుడు బోసిపోయిందని, ఒక్క దాడితో అంతా తల్లకిందులైపోయిందని బాధపడ్డాడు. తన హటల్‌ లో ఉన్న ఆరు రూమ్స్ వచ్చే నెల వరకూ బుక్ అయిపోయాయని, అయితే ఒక్క రాత్రితో తన తలరాత మారిపోయిందని, హోటల్ లో బస చేసిన టూరిస్టులంతా బుధవారం ఉదయమే ఖాళీ చేసేసారని అన్నాడు.వారి భయం, ఆందోళనలో అర్ధం ఉందని ఆ యజమాని అన్నాడు.

పోనీ రైడర్ ఇంటికి మీడియా తాకిడి

ఇక దాడి జరిగిన బైసరన్ లోయ సమీపం దెయ్యాల దిబ్బగా మారింది. టూరిస్టులను రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నించి దాడిలో చనిపోయిన గుర్రపు రైడర్ ఇల్లు మూగబోయింది. ఆదిల్ హుస్సేన్ షా ఇంటి ముందు రకరకాల కశ్మీరీ సంప్రదాయ దుస్తులను కూడా అమ్మేవాడు. ఇప్పుడక్కడ ఆ కలర్ ఫుల్‌ జాయ్ కనపించడం లేదు. దాని బదులు దేశ, విదేశీ, కరస్పాండెంట్లు, టెలివిజన్ ఛానళ్ల సిబ్బంది, కెమెరాల తాకిడి కనిపిస్తోంది.

ఆదిల్‌ హుస్సేన్ షా ఉగ్రవాదులతో తలపడ్డాడని, అమాయక టూరిస్టులను ఏమీ చేయవద్దని, ఉగ్రవాదులనుంచి తుపాకులు లాక్కునే ప్రయత్నం కూడా చేసినట్లు ఆతని కుటుంబం చెబుతోంది. అయితే ఉగ్రమూకలు అతగాడి నుదుటిపై కాల్చి చంపేశాయని వాపోయింది. యాత్రికులతో మమేకమై వారికి సహాయ సహకారాలు అందించడంలో ఈ పోనీ రైడర్ చాలా అద్భుతంగా పనిచేసేవాడని రోజుకు కనీసం 5 ఆరు రూపాయలు సంపాదించేవాడని ఆతని కుటుంబం పేర్కోంది. ఎత్తైన కొండల మధ్యున్న ఈ ప్రాంతం చూసేందుకు వచ్చే వారికి అన్ని రకాల సమాచారం, సహాయం అందించేవాడని కానీ ఈ దాడితో ఇప్పుడు తమ జీవనాధారమే దెబ్బతిందని ఆ కుటుంబం విలపిస్తోంది.

వారం రోజులు ఉందామని వచ్చి…

ఈ వేసవిలో కశ్మీర్ లో వారం రోజులు ఎంజాయ్ చేద్దామని బయల్దేరిన ఓ హర్యానా కుటుంబం దాడి జరిగిన వెంటనే తాము బస చేసిన దాల్ లేక్ సమీపంలోని హోటల్‌ నుంచి బయటపడింది. అన్నీ సర్దేసుకుని ఆదరాబాదరా ఎయిర్ పోర్టుకు చేరి తిరుగు ప్రయాణమయ్యింది.

ఒక్కసారిగా పెరిగిన విమాన టిక్కెట్ల ధరలు

టూరిస్టులంతా హడావుడిగా వెనక్కు మళ్లుతుండటం అందుబాటులోఉన్న ఎయిర్ లైన్స్ లో రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకుంటుండంతో ఎయిర్ ఫేర్స్ దారుణంగా పెరిగిపోయాయి. అయితే ఆందోళనలో ఉన్న ప్రయాణీకులను టిక్కెట్‌ రేట్ల విషయంలో బాధించొద్దని కొంత తగ్గించి వారిని నిర్భయంగా ఇళ్లకు చేరేలా తోడ్పడాలని ప్రభుత్వం అన్ని ఎయిర్ లైన్లను కోరింది. టూరిస్టులందరూ ఒక్కసారిగా రిటర్న్ జర్నీలకోసం పోటెత్తడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు కశ్మీరీ ప్రజలు,స్థానిక హోటళ్లు పెద్ద మనసు చేసుకున్నాయి. టూరిస్టులు తమ ప్రయాణం ఖాయం అయ్యేంత వరకూ తమ దగ్గర ఉచితంగా ఉండొచ్చని భయపడొద్దని చెబుతున్నాయి.అలాగే మరికొన్ని లాడ్జీలు, హోటళ్లు కాన్సిలేషన్ ఫీజులను కూడా రద్దు చేశాయి. తమ పర్యాటక రంగం దారుణంగా దెబ్బతిందని, అయినా టూరిస్టుల ఆవేదన అంతకు మించినదని వారి బాధ, ఆందోళనను అర్ధం చేసుకోగలమని స్థానిక వ్యాపారులు అంటున్నారు.ఇది అత్యంత అనుకూలమైన టూరిస్టు సీజన్ అనీ ఇప్పుడే తాము ఏడాదికి సరిపడ సంపాదించుకునేవారమని, కానీ పెహల్గాం దాడి తమ జీవనాధారాన్నిదెబ్బ తీసిందని, చిరు వ్యాపారులు, టూరిస్టు ఆపరేటర్లు, టాక్సీ డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ సీజన్ లో ఎంత లేదన్నా ఖర్చులు పోనూ రోజుకు నాలుగు వేల దాకా సంపాదించే వారమని టూరిస్టు సవారీలు నడిపే టాక్సి డ్రైవర్లు వాపోతున్నారు.అమృతం లాంటి భోజనంలో విషం కలిపినట్లు ఉగ్రవాదుల చర్య ఉందని వారు కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు.

బ్యూటిఫుల్‌ లాండ్ స్కేప్ పై నెత్తుటి చారికలు..

పెహల్గాం అత్యంత సుందరమైన ప్రాంతం. అక్కడ ఎన్నో లాండ్ స్కేప్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీకి, ట్రెక్కింగ్ కు, రివర్ రాఫ్టింగ్ కు, ఫిషింగ్, నేచర్ వాక్ ఇలా ఎన్నో అద్భుతాలకు ఈ ప్రాంతం అత్యంత అనుకూలమైనది. దట్టమైన ఆల్పైన్, పైన్ వృక్షాలు, చిక్కని,పచ్చని అడవులు, ఎన్నో సెలయేళ్లతో అందంగా ఉండే ప్రాంతం. బాలీవుడ్ సినిమాలకు ఇదొక ఫేవరెట్ షూటింగ్ స్పాట్ కూడా. బేతాబ్ సినిమా ఇక్కడే షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతానికి బేతాబ్ అని కూడా పేరు పెట్టారు. పైగా పెహల్గాం అమర్ నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ ప్రదేశం కూడా. ఆ రకంగా కూడా ఇది హిందువులకు ఈ ప్రాంతం సెంటిమెంట్. దారి పొడవునా తులిప్ పూల తోటలు,రోడ్ల పక్కన పసుపు పచ్చని పూలతో అలరించే ఆవాల పంటలు కనువిందు చేస్తాయి. టూరిజం పెరగడంతో ఓ మాదిరి హోటళ్లు సైతం నైపుణ్యం కలిగిన చెఫ్ లను నియమించి అన్ని ప్రాంతాల వంటలనూ వినియోగ దారులకు అందుబాటులో ఉంచేవి.

ఎయిర్ పోర్టు ఖాళీ…

ఉగ్రదాడి తర్వాత శ్రీనగర్ ఎయిర్ పోర్టు దాదాపు ఖాళీ అయిపోయింది. భయం ఆందోళనతో ఉన్న ప్రయాణికుల తో రెండు రోజులు రద్దీగా కనిపించిన ఎయిర్ పోర్టు ఇవాళనుంచి నిర్జన ప్రదేశంగా మారింది. రాకపోకలు లేక నిర్మానుష్యంగా కళా విహీనంగా కనిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com