23.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

భూ భారతి చట్టం చారిత్రాత్మకం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భూ భారతి 2025 చట్టాన్ని ప్రారంభించడం ఇవాళ ఒక చారిత్రాత్మకమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలా, ఎలాంటి అడ్డంకులు లేకుండా రూపొందించినందుకు గర్వంగా ఉందన్నారు.

హైదరాబాద్ శిల్పారామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమికి, మనిషికి విడదీయరాని సంబంధం ఉందని, అనేక పోరాటాల ద్వారా సాధించిన భూమిపై హక్కులను ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకులదే.. అని అన్నారు. గత పాలకులు తీసుకొచ్చిన ధరణి చట్టం రైతుల జీవితాలను అల్లకల్లోలం చేసిందని, 10 సంవత్సరాలు శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్న తన అనుభవాన్ని గుర్తుచేశారు. ధరణి వల్ల రైతులు తమ హక్కులు కోల్పోయారని, రైతుల హక్కులను కొందరు పెత్తందారుల కాళ్లకు తాకట్టు పెట్టిన విధానమని విమర్శించారు.

2023 మార్చి 16న ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు చేసిన పీపుల్స్ మార్చ్‌ పాదయాత్రలో రైతులు తమ సమస్యలను తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని రైతులకు ఆరోజే హామీ ఇచ్చిన సంగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

భూమి అంటే ఆత్మగౌరవం, నమ్మకం అని వ్యాఖ్యానించిన భట్టి విక్రమార్క.. గతంలో ధరణి వల్ల బాధపడిన ఓ రైతు తహసిల్దార్‌పై పెట్రోల్ పోసి, తనను తాను కాల్చుకున్న ఘటనను గుర్తుచేశారు. ఆ రైతు తన బాధను ప్రభుత్వం మీద తూటాల్లా పేల్చాడు. కానీ అప్పటి పాలకులు పట్టించుకోలేదని అన్నారు. భూ భారతి చట్టం రైతులకు న్యాయాన్ని కల్పించే చట్టం అని చెప్పారు. కలెక్టర్ల నుండి రెవెన్యూ అధికారుల వరకు ప్రజలకు అవగాహన కల్పించేలా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు.

గత పాలకులు అసైన్డ్ భూముల పంపిణీని నిలిపివేసిన నేపథ్యంలో, భూ భారతి చట్టం ద్వారా అసైన్డ్ కమిటీలను పునరుద్ధరించి, అర్హత కలిగిన పేదవారికి భూముల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

అంతేగాక, స్వాతంత్రం కోసం దేశంలో పోరాటాలు జరిగితే, తెలంగాణలో భూమికోసం పోరాటాలు జరిగాయని, ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదంతో టెనెన్సీ చట్టాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. తెలంగాణ రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టాన్ని అంకితంగా ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com