39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

రాహుల్ గాంధీ తిరోగమనవాది అనడాన్ని ఖండిస్తున్నాం – భట్టి విక్రమార్క

  • భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌

  • భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది

  • భారత రాజ్యాంగమే సకల సమస్యలకు పరిష్కారం

దేశంలో భారత రాజ్యాంగమే లేకుండా చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే భారత్ సంవిధాన్ బచావో అంటూ పిలుపు ఇవ్వడంతో పాటు దేశంలో కులగణన సర్వే చేసి జనాభా దామాషా ప్రకారంగా సంపద, వనరులు, రాజకీయ అవకాశాలు పంచాలని సామాజిక న్యాయంకై ఆలోచన చేస్తున్న రాహుల్ గాంధీని తిరోగమన వాది అనడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఖండించారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని, రాజ్యాంగమే లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ, బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టి, దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు, ఓటు హక్కుతో పాటు ఇతర హక్కులు పొందుతున్న ప్రతి పౌరుడు  భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.  బిజెపీ, బీఆర్ఎస్ పార్టీలు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో అని పిలుపు ఇచ్చారన్నారు. ఈ సంవిధాన్ తో పాటు దేశంలో కుల గణన చేసి బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ చేస్తున్న ఆలోచన ప్రకారం మొట్ట మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన సర్వే చేయించి, ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి, ఆ బిల్లును పాస్ చేయడానికి గవర్నర్ కు పంపించడమే కాకుండా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేము అందరం  ఢిల్లీకి వెళ్లి  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఇది దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రయత్నం చేసి  సామాజిక విప్లవానికి తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందన్నారు. రాష్ట్రంలో కులగణన చేసి 56 శాతం బలహీన వర్గాలు ఉన్నారని లెక్కలతో సహా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అన్నారు.

కుల గణన సర్వే ద్వారా వచ్చిన  ఆధారంగా  ఆస్తులు, వనరులు, సంపద  ఎవరి వద్ద ఉన్నాయో అన్న వాస్తవ విషయాలు బయట పెట్టి, సర్వే ప్రకారంగా సంపద పంచే కార్యక్రమం మొదలుపెడితే ఈ దేశంలో తమ ఉనికికే ప్రమాదం అని భావించిన బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేక ఆనాడు పీవీ నరసింహారావు దేశంలో భూసంస్కరణలు తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా కుట్రపూరితంగా అడ్డుకోవడానికి జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆనాటి ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టారో బిజెపి, బీఆర్ఎస్  అదే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుండా మిగతా అంశాలను ముందుకు తీసుకువచ్చి, బిజెపి బిఆర్ఎస్ పార్టీలు ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై  దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా 42 శాతం రిజర్వేషన్ సాధించుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు బహుజనలందరు ఏకమవుతారని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి వీరందరూ అండగా ఉంటారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని వెల్లడించారు.

తర తరాలుగా ఈ దేశంలో  అణగదొక్కబడిన వర్గాల కోసం, వెనుకబడిన వర్గాల కోసం ఆలోచన చేసి సమాజంలో వారిని సమాన స్థాయికి తీసుకురావడానికి ప్రత్యేక హక్కులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారని వివరించారు. పని చేసే మహిళలకు ప్రసూతి సెలవులు ఉండాలని, ఇతర హక్కులు ఉండాలని, పని చేసే భారతీయ స్త్రీలకు హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగమని కొనియాడారు. ఈ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగమే సకల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నదని  స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com