తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలుచేస్తోన్న రైతు భరోసా, రైతు రుణమాఫీపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. రెండులక్షల రూపాయల లోపు రుణాలన్నీ రైతులవి ఒకే విడతలో మాఫీ చేశామని ప్రకటించారు. కేవలం మూడు నెలల్లోనే రుణాలు తీసుకున్న రైతుల బ్యాంకు అకౌంట్లలోకి 22 వేల కోట్ల రూపాయలు జమచేశామన్నారు. సాంకేతిక కారణాలతో ఎవరికైనా రాకపోతే.. వాళ్లను గుర్తించి చివరి రైతు దాకా కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ సిటీలోని 15వ డివిజన్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి మొగిలి చెర్లలో భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీసీఎం విక్రమార్క మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదని మండిపడ్డారు. కానీ, తమ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి యేడాదిలోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రైతు భరోసాపై కూడా బీఆర్‌ఎస్ నేతలు చాలా దుష్ప్రచారం చేశారని, కానీ, ఈ నెల 26 వ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు కూడా అన్నదాతల అకౌంట్లలోకి జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో భూములు సాగుచేస్తున్న రైతులందరికీ రైతు భరోసా ఆర్థిక సాయం అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు మోసపోయామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి.. గత బీఆర్‌ఎస్ మోసం చేసిందని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
ఇక, రైతు భరోసా పథకంపై అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొట్టిపారేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని వర్గాల ప్రజల పోరాటం కీలకమైందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణను ఎంతో కష్టపడి సాధించుకున్నామని గుర్తు చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు ధైర్యంగా వివరిస్తున్నామని.. తాము ప్రగతిబాటలో పయనిస్తున్నాం కాబట్టే ప్రజలకు ధైర్యంగా వివరిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, యేడాది కాలంలోనే రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఆర్థికంగా ఎంతగా ఇబ్బందులున్నప్పటికీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మాట మీద నిలబడుతున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.