పాక్ నౌకల రాకపోకలు పెరిగితే ఇక అంతే…
భారత్ కు కుడి, ఎడమల్లో పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్థాన్, బంగ్లా దేశ్ అస్థిరతకు కేరాఫ్ అడ్రస్.. మిలిటెన్సీకి, ఆయుధాల అక్రమ రవాణాకు, స్మగ్లింగ్ కి, మాదక ద్రవ్యాల రవాణాకు,నకిలీ కరెన్సీకి, చొరబాట్లకు ఈ రెండు దేశాలు పెట్టింది పేరు.. ఈ నేపధ్యంలో ఈ రెంటి మధ్య సముద్ర మార్గ రవాణా భారత్ కు కొత్త తలనొప్పులు తెస్తుందా? బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఏర్పడిన అనిశ్చితి వల్ల మన దేశంలో అక్రమ చొరబాట్లకు, అస్థిరతకు ఆస్కారముందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండుదేశాల మధ్య సముద్ర రవాణా బంధాలు బలపడటం వల్ల మన దేశానికి కొత్త తలనొప్పులు వస్తాయనే భయాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి భారత్ గత కొన్నేళ్లుగా ఈ సమస్యపై ద్రుష్టి పెట్టింది. మొన్న నవంబర్ 13న కరాచీకి చెందిన నౌక బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్లో సరుకుతో సహా ఆగడం ప్రత్యక్షంగా చూసిన తర్వాత మన దేశం జాగ్రత్త పడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.1971 లో బంగ్లాదేశ్ వి ముక్తి తర్వాత ఈ రెండు దేశాల మధ్య నేరుగా సంబంధాలే లేవు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను బలవంతంగా గద్దె దింపాక కొత్త ప్రధాని మహమ్మద్ యూనస్ అధికారం చేజిక్కించుకున్నాక పాకిస్థాన్, బంగ్లా దేశ్ మధ్య తొలిసారి ఇలా వాణిజ్య బంధాలు బాహాటంగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక నేత మహమ్మద్ యూనస్ పాకిస్థాన్ తో ద్వైపాక్షిక వాణిజ్య బంధాలను పునరుద్ధరించుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు.
మళ్లీ మొదలైన సముద్ర మార్గ రవాణా
నవంబర్13న ఎంవి యువాన్ క్సియాన్ ఫా ఝోంగ్ అనే సరకు రవాణా నౌక చిట్టగాంగ్ పోర్టుకు చేరుకుని సరుకుని దించి అదే రోజు వెనుదిరిగింది. 182 మీటర్ల పొడవైన ఈ నౌక బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన రా మెంటీరియల్, కొంత ఆహారానికి సంబంధించిన సరుకును డంపింగ్ చేసినట్లు పోర్టు అధికారులు చెప్పారు. దీనిలో కొంత సరుకు పాకిస్థాన్ నుంచి కాగా, మరికొంత యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ నుంచి పంపినది అని తెలుస్తోంది.నౌకలో 115కంటైనర్లలో వస్త్ర పరిశ్రమకు ఉపయోగించే సోడాయాష్ ను తరలించినట్లు చెబుతున్నారు. బంగ్లాదేశ్ పాకిస్థాన్ నుంచి దిగుమతులపై ఆంక్షలను తొలగించిన తర్వాత తొలి పరిణామమిది. యూనస్ అధికారం చేపట్టగానే ఈమార్పులు చెక చెకా జరిగిపోయాయి.1971 యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య ప్రత్యక్షంగా నౌకా వాణిజ్య బంధాలు లేవు. బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా ఉన్నన్నాళ్లు భారత్ తో బంగ్లాదేశ్ సంబంధాలు బలపడ్డాయి. అదే టైమ్ ల్ పాకిస్థాన్తో ఎలాంటి లావాదేవీలు లేకుండా ఆమె నిర్ణయాలు తీసుకునేవారు. 2022లో చైనా వాళ్లు తయారుచేసిన పీఎన్ ఎస్ తైమూర్ వార్ షిప్ ను చిట్టగాంగ్ పోర్టులో నిలిపేందుకు చేసిన ప్రయత్నాలను కూడా హసీనా అడ్డుకున్నారు. దాంతో ఆ నౌకను శ్రీలంక దేశ తీరంలో నిలిపి కంబోడియా, మలేసియా దేశాలతో తొలిసారి సైనిక విన్యాసాలను నిర్వహించింది చైనా. బంగ్లాదేశ్ లో అతిపెద్ద పోర్టులైన చిట్టగాంగ్, మోంగ్లాలలో అయిదు దశాబ్దాల నుంచి పాకిస్థాన్ నౌకలకు ఎంట్రీ లేదు. ఇరు దేశాల మధ్య సరుకు రవాణా ప్రత్యక్షంగా జరగనప్పటికీ సింగపూర్, లేదా కొలంబోలలో ఎక్కడో ఒక చోట ట్రాన్స్ షిప్ మెంట్ జరిగేది.
భారత్ కు పెరుగుతున్న ముప్పు..
కానీ ఇప్పుడు ద్వైపాక్షికబంధాలు బలోపేతం అవడం వల్ల భారత్ కు చొరబాట్లు, మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్ బెడద పెరిగే అవకాశముంది.చొరబాటుదారులు, మిలిటెంట్లు స్మగ్లింగ్ సరుకుతో, మాదక ద్రవ్యాలతో,నకిలీ కరెన్సీతో బంగ్లాదేశ్ ద్వారా మన దేశంలోకి చొరబడి అస్థిరతను స్రుష్టించే అవకాశాలున్నాయని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2004లో చిట్టగాంగ్లో అక్రమ ఆయుధాలు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. దాదాపు 40 లక్షల డాలర్ల విలువైన చైనీస్ వెపన్స్, ఇతర ఆయుధాలు 1500ల బాక్సుల్లో చిట్టగాంగ్ లోకి బలవంతంగా తరలించారు.దక్షిణాసియాలో ఇంత పెద్ద ఎత్తున మారణాయుధాలు, నిషేధిత ఆయుధాలను తరలించే నైపుణ్యం, దురుద్దేశం పాకిస్థాన్ ఐఎస్ ఐకి మాత్రమే ఉంది. షేక్ హసీనా అధికారంలో ఉన్నన్నాళ్లు వీళ్ల ఆటలు సాగలేదు.
వీసా అక్కరలేదన్న పాక్..
2023లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం విలువ కూడా 800 మిలియన్ల అమెరికన్ డాలర్లకు పడిపోయింది. ఆమెను తప్పించాక బంగ్లా, పాక్ దేశాల మధ్య వీసా నింబంధనలను కూడా సరళతరం చేసేశారు. బంగ్లాదేశీయుడెవరైనా పాకిస్థాన్ కు ఎలాంటి వీసా లేకుండానే రావొచ్చని ఆ దేశం ప్రకటించింది. రెండు దేశాల మధ్య ఆంక్షలు సడలించాక బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా పాక్ నుంచి ఆర్డర్ చేసింది. అత్యాధునిక, ప్రమాదకరమైన ఆయుధ సంపత్తి, 40 టన్నుల ఆర్డీ ఎక్స్ కూడా అందులో ఉంది.. పెను విధ్వంసం చేయగల సత్తా ఈ ఆయుధాలకు ,పేలుడు సామాగ్రికి ఉంది.
భారత, బంగ్లాదేశాల మధ్య దౌత్యపరమైన ఒప్పందాల్లో భాగంగా మాంగ్లా పోర్టులోని ఒక టెర్మినల్ ఆపరేటింగ్ రైట్స్ ఇండియాకు దక్కాయి. కానీ ఇప్పుడు పాకిస్థాన్ చిట్ట గాంగ్ పోర్టుతో సంబంధాలు కలిగి ఉన్నందున ఆ ప్రభావం భారత ఉపఖండంపై తప్పనిసరిగా పడుతుంది. ఎందుకంటే మయన్మార్, చిట్ట గాంగ్ చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు. మయన్మార్ లో 2021లో సైనిక చర్య ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఆర్మీ గద్దెనెక్కింది.అప్పుడు జరిగిన అంతర్యుద్ధంలో దాదాపు 50 వేలమంది చనిపోగా 30లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ కారణంగానే మన దేశంలో కూడా చొరబాట్లు, నార్కో ట్రేడింగ్ పెరుగుతాయని భారత్ ఆందోళన పడుతోంది. మారణాయుధాలు, నార్కోటిక్ ట్రేడింగ్ పెరిగితే ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలు ఎక్కువవుతాయి.
ఇప్పుడు షేక్ హసీనాను తప్పించి యూనస్ గద్దె నెక్కాక బంగ్లా, పాక్ మధ్య వాణిజ్య బంధాలు బలపడితే అది ఖచ్చితంగా మన దేశానికి ప్రమాదమేనని రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. అసలే భారత,పాకిస్థాన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న ఈ టైమ్ లో బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు మనకు ఆందోళన కలిగించేవే.