35.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

చేసింది చెప్పుకోవడంలో కాంగ్రెస్‌ సక్సెస్‌

– విజయోత్సవాలతో రాష్ట్రమంతటా జోష్‌
– సమిష్టి కృషితో ప్రగతి పయనం

తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ యేడాది విజయోత్సవాలు జరుపుకుంటోంది. అధికారం చేపట్టి సరిగ్గా యేడాది అయిన సందర్భంగా ఆ వేడుకలను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా వారం రోజుల ముందునుంచే ఉత్సవాలు మొదలుపెట్టింది. ప్రజాపాలన విజయోత్సవాలు పేరిట రాష్ట్రమంతటా సభలు నిర్వహిస్తోంది. గతంలో మాదిరిగా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కవరయ్యేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. రాజధాని నగరం హైదరాబాద్‌ సహా.. అటు ఉత్తర తెలంగాణతో పాటు.. ఇటు.. దక్షిణ తెలంగాణలోనూ సభలు నిర్వహిస్తోంది. కేవలం సభలకు ప్లాన్‌ చేయడం, వాటిని విజయవంతంగా నిర్వహించడం మాత్రమే కాదు.. ప్రసంగాల్లో కూడా ప్రజలను ఆకట్టుకునేలా దూసుకుపోతోంది.

మొన్నటికి మొన్న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రైతు బహిరంగసభ నిర్వహించింది ప్రభుత్వం. ఆ తర్వాత నిన్న పెద్దపల్లిలో యువవికాసం పేరుతో మరో భారీ బహిరంగ సభ నిర్వహించింది. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రైతు ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించారు. ప్రధానంగా రైతుల రుణమాఫీ, బోనస్‌ వంటి అంశాలపై సీఎం, మంత్రులు ఫోకస్‌ పెట్టారు. అంతేకాదు.. రైతు భరోసా కూడా సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తామని అన్నదాతల్లో ఆశలు రేకత్తించారు.

ఇక, ఇటు.. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ప్రధానంగా యువకులు, నిరుద్యోగులు, యువ ఉద్యోగులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందించారు. గడిచిన పదేళ్లుగా చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నామని చెప్పుకొచ్చారు. యేడాది కాలంలోనే రికార్డ్‌ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మొత్తం 55వేల నియామకాలు చేపట్టామన్నారు. 10 నెలల వ్యవధిలోనే 11వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. అలాగే, పెద్దపల్లి సభలో పలువురు ఉద్యోగార్థులకు నియామక పత్రాలు అందజేశారు. దీంతో నిరుద్యోగుల్లో, ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల్లో భరోసా పెరిగేలా చేయగలిగారు. ఉద్యోగ నియామకాలు ఇకపై రెగ్యులర్‌గా జరుగుతాయని, తమకు కూడా ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉందని పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థుల్లోనూ ఆశలు కలిగాయి.

అంతేకాదు.. ఉద్యోగ నియామకాల అంశానికి సంబంధించి గ్రూప్‌-1, డీఎస్సీ రాత పరీక్షల విషయంలో ప్రహసనం చోటు చేసుకున్నా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమాత్రం విమర్శలు రాకుండా, పరీక్షల వ్యవహారంలో వివాదాలు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా నిర్వహించింది. ఇది కూడా ప్రభుత్వానికి పాజిటివ్‌ వేవ్స్‌ను తీసుకొచ్చింది. ఫలితంగా యేడాది విజయాలను చెప్పుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సక్సెస్‌ అవుతోంది.

ఇక, సభలకు ప్లాన్‌ చేయడం, వాటిని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ప్రజల్లో సానుకూల సంకేతాలు వెళ్లేలా ప్రభుత్వం తీరు ఉంటోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి సభలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా.. మంత్రులు కూడా కలిసి వెళ్తున్నారు. సమిష్టిగా ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ పరిణామం కూడా ప్రజల్లోకి పాజిటివ్‌ దృక్ఫథాన్ని తీసుకెళ్తోంది.

వాస్తవానికి రెండు మూడు నెలల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. చెరువుల ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తోన్న హైడ్రా, మూసీ ప్రక్షాళన, లగచర్లలో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం వంటి అంశాలు కాస్త గ్రాఫ్‌ తగ్గించే పరిస్థితులకు కారణమయ్యాయి. యేడాది పాలన పూర్తవుతున్న సమయంలో, విజయోత్సవాలకు ప్రణాళికలు రూపొందిస్తున్న వేళ.. ఇలాంటి సంకేతాలు కాంగ్రెస్‌ ముఖ్యనాయకుల్లో, ప్రభుత్వ పెద్దల్లో కాస్త ఆలోచనకు దారి తీశాయి. కానీ, విజయోత్సవాలు ప్రారంభం కాగానే.. ఆ వ్యతిరేకత అంతా కనుమరుగైపోయింది. కేవలం కాంగ్రెస్‌ అనుకూల పవనాలే రాష్ట్రమంతటా వీస్తున్నాయన్న ఫీడ్‌బ్యాక్‌ వస్తోంది. ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రతి సభా సక్సెస్‌ అవుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంతా కలిసి కట్టుగా విజయపథంలో పయనిస్తున్నారు. దీంతో, సర్కారు పెద్దల్లో, కాంగ్రెస్‌పార్టీ శ్రేణుల్లోనూ జోష్‌ పెరిగింది.

ఇక, యేడాది ప్రజాపాలన విజయోత్సవాలు ముగింపు వేడుకలు కూడా అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈనెల 7, 8, 9 తేదీల్లో మరింతగా జోష్‌ పెంచేలా ప్రోగ్రామ్స్‌కు రూపకల్పన చేశారు. సినీ ప్రముఖులతో కన్సర్ట్స్‌కు కూడా ప్లాన్‌ చేశారు. సెక్రెటేరియట్‌, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లలో ఆ మూడు రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొనేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com