- మణిపూర్ ప్రభుత్వం నుంచి వైదొలగిన జేడీయూ
- తమ ఏకైక ఎమ్మెల్యేను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని లేఖ
- మణిపూర్ బీజేపి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు
- కానీ బీహార్, మోడీ ప్రభుత్వాలు సురక్షితమేనా?
- అసలే ఈ ఏడాది బీహార్ కు అసెంబ్లీ ఎన్నికలు
ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయిన జేడీయు అధినేత నితీష్ కుమార్ బీజేపికి మళ్లీ చుక్కలు చూపించడం మొదలు పెట్టారు. అయితే దీనివల్ల బీజేపికి నేరుగా నష్టం ఉండకపోవచ్చు. కానీ కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ఒక రకంగా బలమైన బెదిరింపు సంకేతమే. మణిపూర్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జేడీయూ బీజేపికి మద్దతు ఉపసంహరించుకుంది. ఆ పార్టీకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే బీజేపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు. అయితే దీని ప్రభావం మణిపూర్ ప్రభుత్వంపై ఏమీ పడదు. కానీ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి మాత్రం ఒక బెదిరింపు సంకేతం అందుతుంది.
మేఘాలయలో అధికారంలో ఉన్న సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన కొద్ది నెలలకే జేడీయూ ఈ నిర్ణయం తీసుకుంది. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు సీట్లు గెలుచుకుంది. అయితే వీరిలో ఐదుగురు బీజేపీలో చేరిపోయారు. అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపి బలం 37మంది శాసనసభ్యులు. నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు కాబట్టి ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. జేడీయూ నిర్ణయాన్ని బయటకు వెల్లడించిన ఆపార్టీ మణిపూర్ యూనిట్ అధ్యక్షుడు స్పీకర్‌కు, గవర్నర్ కు లేఖలు రాశారు.
బ్లాక్ మెయిలింగ్ మొదలైందా?
ఈ పరిణామం మణిపూర్ బీజేపికి ఏ విధమైన నష్టం కలిగించదు. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి, బీహార్ సంకీర్ణ ప్రభుత్వానికి కూడా జేడీయూ మద్దతు కొనసాగుతోంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి తగిన మెజారిటీ లేనందున ఎన్డీఏ కూటమి భాగస్వాములతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో 12 ఎంపీసీట్లున్న జేడీయూ బీజేపికి మద్దతు పలికింది. ప్రభుత్వంలో కీలక మంత్రిపదవులు కూడా తీసుకుంది. ఇక బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. నితీష్ కుమార్ ను నమ్మడమంటే కొరివితో తల గోక్కోడం లాంటిదే. గడచిన చరిత్రే అందుకు ఎన్నో ఉదాహరణలు చెబుతుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పటి వరకూ ఇండియా బ్లాక్ లో ఉన్న నితీష్ పార్టీ ఆ తర్వాత బీజేపితో చేతులు కలిపి ఎన్డీఏ కూటమిలో చేరి కేంద్రంలో పదవులు పొందింది. కాబట్టి నితీష్ ప్రవర్తనను, రాజకీయ వ్యూహాలను గమనించిన వారికి ఆయనపై కొంత అపనమ్మకం ఏర్పడటం ఖాయం. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ఇలాంటి ఝలక్ ఏదైనా ఇస్తారేమోనన్న డౌట్స్ చాలా మందికి ఉన్నాయి.