23.8 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్లు చిన్నవిషయమా?

దిల్ రాజు వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల విస్మయం

అల్లు అర్జున్ కాంట్రవర్సీ నేపధ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రేగిన కల్లోలం  టీకప్పులో తుఫానులా చల్లారిపోయింది. పుష్ప 2 ప్రీమియర్ షో  సందర్భంగా సంధ్య ధియేటర్లో తొక్కిసలాట, ఓమహిళ మరణం వివాదం  సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైంది. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన  సినిమాలకు  తొలివారంలోనే అత్యధిక వసూళ్లు, లాభాలు రాబట్టుకోవాలన్న ఇండస్ట్రీ పెద్దల ఉత్సాహంపై సీఎం నీళ్లు జల్లారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, సినిమా టిక్కెట్ల ధరల పెంపుదల ఉండబోదని ఖండితంగా తేల్చేశారు. ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజే సీన్ లోకి దిగినా ప్రయోజనం సున్నా.  ఆ రెండు నిర్ణయాల వాపస్ అసాధ్యమని రేవంత్ తేల్చేశారు. దాంతో 36 మందితో ఓ పెద్ద బెటాలియన్ లా వెళ్లిన టాలీవుడ్ దిగ్గజాలకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. ఏదో చేసి పరిస్థితి చక్క దిద్దుతారనుకున్న దిల్ రాజు కూడా బయటకు వచ్చి బెనిఫిట్ షోలు, సినిమా టిక్కెట్ల రేట్లు పెంపు అన్నవి చాలా చిన్న విషయాలు అని తేల్చేశారు. లోపల అసలేం జరగలేదని సమావేశం అంతా సానుకూలంగా సాగిందని, అసలు ఇండస్ట్రీ నుంచి కర్టసీ కాల్ లాగా  మాట్లాడారు. కానీ సమావేశానికి వెళ్లిన వారంతా దిగ మింగుకోలేని అసహనంతోనే బయటకు వచ్చారన్న విషయం గత కొద్దిరోజులనుంచి పరిస్థితులను  గమనించినవారికి సులభంగా అర్ధమవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో అసలు తమకెలాంటి నష్టం లేదని, ప్రభుత్వానికి టాలీవుడ్ సహకరిస్తుందని అగ్ర నేతలు, ఇండస్ట్రీ ప్రముఖులు పైకి ముఖాలపై నవ్వులు పూసుకుని బయటకొచ్చి మాట్లాడారు.

 మరి అప్పుడెందుకు అలా?

సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల రద్దు దిల్ రాజు చెప్పినట్లు నిజంగానే అంత చిన్న విషయాలా? అసలు పట్టించుకోవాల్సిన పనేలేదా? ఈ పరిణామాలన్నీ ఏపీ సీఎం జగన్ గతంలో తీసుకున్న ఇవే నిర్ణయాల పట్ల  అప్పట్లో రేగిన వ్యతిరేకతను ఇక్కడ ప్రస్తావించుకోక తప్పదు.

జగన్ ఏమన్నారు?

సినిమా అన్నది మూడు గంటల వినోదం.. సగటు ప్రేక్షకుడు కోరుకునే రిలాక్సేషన్. సామాన్యులకు సైతం  సినిమాలు అందుబాటులో ఉండాలంటే వినోదం అందించాలంటే బెనిఫిట్ షోలను అనుమతించేదిలేదని, సినిమా టిక్కెట్ల రేట్లను పెంచేది లేదని సీఎం జగన్ అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. పైగా అందుకు సమగ్రమైన వివరణ కూడా ఇచ్చారు. భారీ బడ్జెట్ మూవీస్ ఎవరైనా తీస్తే వందకోట్లు బడ్జెట్ దాటితే ఆ వివరాలు ప్రభుత్వానికి సమర్పిస్తే  వారికి వెసులు బాటు పై ఆలోచిస్తామన్నారు. మొత్తం బడ్జెట్లో హీరో రెమ్యునరేషన్ తో కలిపి వంద కోట్లు దాటితే ఆ వివరాలు, వారు కట్టిన జీఎస్టీ వివరాలు ప్రభుత్వానికి సమర్పిస్తే టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అంతేకాదు హీరోలకు ఓ మంచి సూచన కూడా చేశారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూడటానికి ఏడాదికి వెయ్యి రూపాయలకు మించి ప్రీమియమ్  ఖర్చుకాదని ఈ రెంటి మధ్య బాలెన్స్ పాటించకపోతే వచ్చే కాలంలో థియేటర్లలో సినిమాలను చూసే వారు ఉండరని అన్నారు.  ఇప్పుడే మేల్కొని ఏదో ఒక నిర్ణయానికి రాకపోతే పరిశ్రమకు కూడా గడ్డు కాలం ఎదురవుతుందని ఎంతో ముందు చూపుతో చెప్పారు. ఇండస్ట్రీ అంతా తెలంగాణలో ఉండిపోడం ఎందుకని ఏపీలోనూ స్టూడియోలు పెట్టుకోండి. ఇళ్లు కట్టుకోండి.. అందరూ ఇక్కడి వారే.. తెలంగాణ ఆదాయానికి అంత సాయపడుతున్న మీరంతా ఏపీకి వస్తే స్టూడియోలు పెట్టడానికి స్థలం ఇస్తామని, ఇళ్లు కట్టుకోడానికి రాయితీలు ఇస్తామని కూడా ప్రతిపాదించారు. విశాఖకి అందరినీ తరలి రమ్మని పిలుపునిచ్చారు. ఏపీలో షూటింగులు జరిపితే 20 శాతం రాయితీలిస్తా మన్నారు. జగన్ ఇంత విశాల ధ్రుక్పథంతో ఓపెన్ మైండ్ తో ఆ రోజు ప్రతిపాదనలు పెడితే ఇండస్ట్రీ మొత్తం తిరగబడి పోయింది.

నాని లాంటి హీరోలయితే బాహాటంగానే ద్వేషం కక్కారు. ఇక సినిమాలు తీసుకోవడం ఎందుకు?  కిరాణా కొట్టు నడుపుకోడం బెటర్ అంటూ ఘాటైన సెటైర్లు వేశారు. మరి కొందరు జగన్ ను అరాచకవాదిలా ముద్రవేశారు.. శాడిస్ట్ అన్నారు. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా దీనిని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి.

ఎవరిది అరాచకం?

ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే  ఇండస్ట్రీ అంటే తనే అన్నట్లుగా మాట్లాడారు. తన సినిమాలను దెబ్బ కొట్టేందుకే జగన్ ఇలా వ్యహరించారని అన్నారు. అంతేకాదు.. సీమ రౌడీలు, ఆకు రౌడీలు తెలుగు సినిమా ఇండస్ట్రీపై మీ కన్నుపడింది. తొక్కి నారతీస్తాం.. లాంటి అభ్యంతరకర భాషనూ వాడారు చాలా మీటింగుల్లో. చివరకు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో కూడా పవన్ నోరు పారేసుకున్నారు. వెళ్లినది  మేనల్లుడి మూవీ ఫంక్షన్ కి.. కానీ అక్కడ మాట్లాడింది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి. కోడి కత్తితో ఓ నాయకుడిని పొడిచారు.. దాని సంగతేంటి అని ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అక్కడే ఉన్న దిల్ రాజును ఉద్దేశించి మీరు రెడ్డి ఆయన రెడ్డి మీరు మీరు మాట్లాడుకుని ఇష్యూని సెటిల్ చేయచ్చు కదా అని కుల ప్రస్తావనలు కూడా చేశారు. అసలు దిల్ రాజు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని అప్పటి వరకూ చాలా మందికి తెలియదు.

చిరంజీవి నేతృత్వంలో సినిమా బృందం చర్చలకొచ్చినప్పుడు చిరంజీవిని అన్నా అని జగన్ సంబోధిస్తే ఆ విషయం మరచి నోటికి పనిచెప్పారు. మెగాస్టార్ చేత దండం పెట్టించుకున్నారని, సీఎం జగన్ కి అహంకారమనీ అన్నారు. చిరంజీవి జగన్ కు నమస్కరిస్తే అందులో తప్పేముందో పవన్ కే తెలియాలి. ఇంటిలోపలికి కార్లు రానివ్వలేదని బయటే ఆపేసి అవమానించారనీ అప్పట్లో కొన్ని మీడియా సంస్ధలు కూడా ప్రచారం చేశాయి.

మాట మార్చిన చిరు..

ఇక చిరంజీవి విషయానికొస్తే లోపల సీఎంకి వంగి దండాలు పెట్టి బయటకొచ్చి చర్చలు అద్భుతంగా సాగాయి  అని ప్రకటించి చివరికి ఓ మూవీ ఫంక్షన్ లో  తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఇండస్ట్రీని తక్కువ చేయాలని చూస్తే ఒప్పుకోమని, ముష్టి విదిల్చి నట్లు మాట్లాడితే సహించేది లేదని, ఎందరో కళాకారుల కష్టం సినిమా అనీ అన్యాపదేశంగా ఏపీ ప్రభుత్వాన్ని దెప్పి పొడిచారు. సినిమా టిక్కెట్ల వివాదం పై పెద్దల సభలో కూడా చర్చించాలా? మా మానాన మమ్మల్ని వదిలేయండి సార్ అన్నారు. అప్పట్లో ఇలా ఏపీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్న వారే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అవే నిర్ణయాలకు కిక్కురమనలేక కృత్రిమ నవ్వులు నవ్వుతున్నారు.

భారీ బడ్జెట్ మూవీలకు ఎదురు దెబ్బ

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సంక్రాంతికి విడుదలయ్యే భారీ బడ్జెట్ మూవీలన్నింటిపైనా ప్రభావం పడుతుంది. చిరంజీవి తనయుడు రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తీశారు. ఈజనవరి 10కి అది విడుదల కాబోతోంది. అలాగే బాలయ్యనటించిన సినిమా  డాకూ మహరాజ్ కూడా 150 కోట్ల బడ్జెట్ అని టాక్. విక్టరీ వెంకటేష్ నటించిన అనిల్ రావి పూడి మూవీ సంక్రాంతికి వస్తున్నాం కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. సంక్రాంతికి అదనపు షోస్, ఆడియన్స్ పెరుగుతారు కాబట్టి తొలివారంలోనే గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసేసుకోవచ్చనుకున్న వారందరికీ  ప్రభుత్వ నిర్ణయం షాకే. మొత్తం మీద బెనిఫిట్ షోల రద్దు, టిక్కెట్ రేట్ల పెంపు ఉండదని తేల్చేసింది. ఇక ఇప్పుడు ఏపీని ఆశ్రయిస్తారా? గతంలో జగన్ నిర్ణయంపై ఇష్టారీతిన నోరు పారేసుకున్న సినిమా పెద్దలు ఇప్పుడేం చేస్తారు?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com