పాకిస్థాన్ భరతం పడతామంటున్నారు తాలిబన్లు. తమ సరిహద్దు గ్రామాలపై పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేయడంతో తాలిబన్లు ఆగ్రహంతో ఉన్నారు. పాక్‌పై యుద్ధానికి 15 వేల మంది ఫైటర్లను తరలిస్తున్నట్టు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తాలిబాన్ పెద్దలు.. ఇప్పుడు తమ మాటలను ఆచరణలో పెడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు తాలిబాన్ గ్రూపులతో పాకిస్థాన్‌కు ముప్పు పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకటి తెహ్రిక్ -ఇ- తాలిబాన్ పాకిస్థాన్.. ఇది అఫ్ఘాన్-పాక్ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. మరోకటి తాలిబాన్ ప్రభుత్వం.
అయితే TTPకి చెందిన శిక్షణ స్థావరంపై పాక్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మంది మృతి చెందారు. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉండటం ప్రస్తుతం ఈ పరిస్థితికి కారణమైందని చెప్పాలి. అయితే తాము ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామని.. ఇందులో ఫైటర్ జెట్స్, డ్రోన్లను ఉపయోగించామని పాక్ ఆర్మీ ప్రకటించింది. అయితే తాలిబాన్ ప్రభుత్వం మాత్రం ఈ దాడులను ఖండించింది. ఇది రెచ్చగొట్టే చర్యగా భావిస్తున్నామని తెలిపింది. అందుకే 15 వేల మంది తాలిబాన్ ఫైటర్లను ఇప్పుడు పాక్ సరిహద్దులవైపు నడిపిస్తోంది.
అఫ్ఘాన్‌లో ఎలాగైతే తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిందో.. పాకిస్థాన్‌లో కూడా అదే విధంగా తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుంది TTP. ఇప్పటికే గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. 2022తో పోల్చితే 2023లో ఉగ్రదాడులు ఏకంగా 56 శాతం పెరిగాయి. ఈ దాడుల్లో 1500 మంది మృతి చెందారు. ఇందులో 500 మంది భద్రతా బలగాలకు చెందిన వారు ఉన్నారు. ఎప్పుడైతే తాలిబాన్‌లను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ.. ఏకంగా 5 లక్షల మంది అఫ్ఘాన్ శరణార్ధులను పాకిస్థాన్ ప్రభుత్వం తరిమేసిందో అప్పటి నుంచి పాక్, అఫ్ఘాన్ దేశాల మధ్య బంధం బలహీనమైంది.
అయితే మొదట్లో ఈ తాలిబాన్లను పెంచి పోషించింది పాక్ ఆర్మీనే అనేది బహిరంగ రహస్యం. పాలు పోసి పెంచిన పామే ఇప్పుడు పాకిస్థాన్‌ను కాటేస్తుందనేది ఓ చేదు నిజం. తాము తీసుకున్న గోతిలోనే ఇప్పుడు పాక్ పడిందన్నది వాస్తవం.