ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సతీ సమేతంగా పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. సాధు సంతుల తోడుగా పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానమాచరించిన అమిత్‌షా అనంతరం ప్రయోగరాజ్‌లోని అనేక మఠాలు, పీఠాలను సందర్శించి పీఠాధీపతుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం హోంమంత్రి అమిత్‌షా సతీ సమేతంగా ప్రయోగ్‌రాజ్‌లోని శృంగేరీ శారాదా పీఠాన్ని సందర్శించారు. అక్కడ శృంగేరీ పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్న అమిత్ షా దంపతులు కొద్దిసేపు స్వామివారితో ముచ్చటించారు. ఈ విషయంపై అమిత్‌షా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి విధుశేఖర భారతీ స్వామి ఆశీర్వాదాలు పొందిన ఆనందం వ్యక్తం చేశారు. మన గొప్ప సాధువులు సనాతన సంస్కృతి యొక్క తత్వశాస్త్రం మరియు ఐక్యత యొక్క ఆలోచనతో ప్రాచీన కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నారు. శృంగేరి పీఠానికి చెందిన శంకరాచార్య జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర్ భారతీ జీ మహారాజ్‌ని ప్రయాగ్‌రాజ్‌లో కలుసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నాను అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.