కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున కేసీఆర్ ఏర్పాటు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. తమమీద అక్కసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయున్ని నిర్భంధించి, అవమానిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ నిర్బంధిస్తున్నది బీఆర్‌ఎస్ నేతలను కాదని, అంబేద్కర్ ఆశయలనని చెప్పారు.
తాళాలు వేసి బంధించి కనీసం శుభ్రపరచకుండా ఎందుకు పెట్టిందని, బీఆర్ఎస్ పైన అక్కసు ఉంటే దానిని అంబేద్కర్ విగ్రహంపైన ఎందుకు చూపిస్తున్నారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక మీ ఉద్దేశమేంటని ప్రశ్నించారు. దళితబంధు తొలగించి అంబేద్కర్ అభయహస్తం తెస్తామన్నారని, ఇప్పటి వరకు దాని అమలు ఊసేలేదని విమర్శించారు.
దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారిపై దండిగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. వందల మంది పోలీసులను పెట్టి తమను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. గురుకులాల్లో 48 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. గురుకుల విద్యార్థులను తాము ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిస్తే.. మీరు పాడె ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేనా మీరు అంబేద్కర్‌కు ఇచ్చే నివాళి అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ గురుకుల బాటను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.
ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీని అడ్డుకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుతాడని, మరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టని విమర్శించారు. రాహుల్ గాంధీ చెప్పేదొకటి చేసేదొకటన్నారు. మీ సీఎంకు జ్ఞానోదయం చేయాలంటూ రాహుల్ గాంధీకి సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతామని చెప్పారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేదని, కావాలని అడుక్కుంటే రాదని ఎద్దేవా చేశారు. కనీసం నెల రోజులు సమావేశాలు జరగాలన్నారు. సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రతిష్టిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా లేదా కాంగ్రెస్ తల్లి విగ్రహమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా లోగోలు, నంబర్ ప్లేట్లు మారాలా అని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టారని విమర్శించారు. ఉద్యమ సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నారని చెప్పారు.
రానున్న అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. 11 నెలల కాలంలో సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తామని హెచ్చరించారు. లగచర్ల అంశం నుంచి మొదలుకొని రాష్ట్రంలో కొనసాగుతున్న ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలులో వైఫల్యం, వ్యవసాయ రంగ సంక్షేపం బట్టి ప్రతి అంశం పైన ప్రజా సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపు మారుస్తానని తెలంగాణ చరిత్రను మారుస్తానని నీచమైన మనస్తత్వంతో ఈ కుటీల ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఇందిరా గాంధీ భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తర్వాతి ప్రభుత్వాలు మార్చినాయా…? అనే విషయం ప్రశ్నించిన కేటీఆర్. తెలుగు తల్లిని కన్నడ తల్లిని మార్చనప్పుడు తెలంగాణ తల్లిని మార్చే కుసంస్కారం భావదారిద్య్రం రేవంత్ రెడ్డికి ఎందుకన్నారు.
తమ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఏర్పాటు చేసిన చోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అమరవీరుల స్తూపానికి అంబేద్కర్ సచివాలయానికి మధ్యన ఉండాల్సింది కచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహమే అన్నారు. అందుకే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పంపాల్సిన చోటికి పంపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ చరిత్ర మారుస్తామంటే ఊరుకునేది లేదని కెటిఆర్ అన్నారు. నిజంగానే రాహుల్ గాంధీకి రాజ్యాంగంపైన ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు పైన సద్బుద్ధి ప్రసాదించాలని సూచించాలని కెటిఆర్ అన్నారు.