ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు రావడం, నిధుల సమీకరణ పూర్తికావడంతో పనులు వేగంగా ముందుకు వెళ్లనున్నాయి. ఏప్రిల్ మూడో వారంలో ప్రధాని చేతుల మీదుగా శుభారంభం జరగనుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది.
217 చ.కి.మీ.ల విస్తీర్ణంలో అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మళ్లీ శ్రమిస్తోందని సీఆర్‌డీఏ కమిషనర్ కే.కన్నబాబు తెలిపారు. ఈమేరకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా గవర్నమెంట్ కాంప్లెక్స్, ప్రధాన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది. ఈ నెలలోనే రూ.లక్ష కోట్ల విలువైన పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయన చేతుల మీదుగానే పనులు ప్రారంభం కానున్నాయి.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, సింగపూర్ ప్రతినిధులకు ప్రస్తుత అభివృద్ధి అంశాలను ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే పి-4 కార్యక్రమం ప్రారంభమైన ప్రాంతాన్ని ప్రధాని పర్యటనకు అనుకూలంగా తీర్చిదిద్దాలని సూచించారు.
50 ఎకరాల విస్తీర్ణంలో ప్రాంతాన్ని చదును చేసి పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. డీజీపీ, సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మిగతా విభాగాలతో కలిసి సమగ్ర నివేదిక సిద్ధం చేయాల్సిందిగా విజయానంద్ సూచించారు. గత ప్రధాని పర్యటనలో చురుకుగా పనిచేసిన అధికారుల జాబితా సిద్ధం చేయాలని ఆయన కోరారు.
వేసవి దృష్ట్యా వీఐపీలు, ప్రజలందరికీ తగిన వసతులు కల్పించేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. పర్యటన ఖరారైన వెంటనే పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అప్పటికే ప్రాథమిక ఏర్పాట్లు పూర్తవ్వాలని అన్నారు.
అమరావతి నిర్మాణంలో గతంలో సింగపూర్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించినట్టే, ఇప్పుడు కూడా సహకారం అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. గత పాలనలో ఏర్పడిన నిధుల టైఅప్‌లు ఇంకా కొనసాగుతున్నాయని, ప్రపంచ బ్యాంకు, హెడ్‌కో, ఎడిబి వంటి సంస్థలతో సమన్వయం జరిగిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం మరింత స్పష్టత వస్తుందని విజయానంద్ తెలిపారు. మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ మాట్లాడుతూ — అమరావతి నిర్మాణం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, మాస్టర్ ప్లాన్ ఇప్పటికే సిద్ధమైందని, ప్రపంచ స్థాయిలో లివబుల్ సిటీగా తయారుచేయడమే లక్ష్యమని చెప్పారు.