- విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
- ఆత్మహత్యకు కారకుడిపై చట్ట ప్రకారం చర్యలుంటాయి
రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. ఆత్మహత్యాయత్నం చేసి రాజమమేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో గత 12 రోజులుగా చికిత్స పొందుతున్న నాగాంజలి శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో నాగాంజలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసిన పవన్ కళ్యాణ్ ఆమె కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్ గా ఉన్న నాగాంజలి తన సూసైడ్ నోట్ లో కారకుడిగా పేర్కొన్న ఆసుపత్రి ఏజీఎం డా.దువ్వాడ దీపక్ ను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారని అతనిపై కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ప్రకటనలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకొన్నప్పుడు పోలీసు శాఖ కూడా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టడంతో పాటు బాధిత వర్గం ఆవేదనను, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. తోటి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడితే విద్యార్థులు ఆందోళనకు లోనవడం సహజమని, కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అత్యాచార, హత్య ఘటన సమయంలో మెడికోలు ఆందోళనలు చేయడాన్ని దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులకు హితవు పలికారు. విద్యార్థులకు, యువతులకు భరోసా, ధైర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులు తీసుకోవాలన్నారు.