కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం
త్వరలో దేశ వ్యాప్తంగా జరిగా జనాభా లెక్కల కార్యక్రమంలో ఈ సారి కుల గణన కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెన్సెస్ అధికారులకు జనాభా లెక్కవలతో పాటు ఏఏ కులాలకు ఎంత మంది జనాభా ఉన్నారన్న లెక్కలు కూడా తేల్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా కుల గణన జరగాలని అనేక వర్గాల నుంచి డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా బలహీనవర్గాలకు చెందిన నాయకులు అసలు దేశంలో ఏఏ కులాలు ఎంత జనాభా ఉన్నారో తేల్చాలని ఎంతో కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. అయితే దేశంలో ఇటువంటి ప్రక్రియ ఇంత వరకూ జరగలేదు. చివరికి ఏ రాష్ట్రం కూడా ఇంత వరకూ కులగణన చేయలేదు. అయితే ఇటీవల తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన పూర్తి చేసింది. ఇకపై ఈ కులగణన ఆధారంగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో నిధుల కేటాయింపు ఉంటుందని తెలంగాణ సర్కా్‌ర్ ప్రకటించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలతో పాటు ఈ సారి కుల గణన కూడా చేయించాలని నిర్ణయం తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా బలహీనవర్గాలకు చెందిన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశంలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణలో మేము నిర్వహించిన కుల గణనే ప్రేరణ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలు విభజన నాటి నుంచి ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ఇంతకాలం జరగకుండా ఉండటానికి జన గణన జరగకపోవడమే కారణమనే వాదన ఉంది. ఇప్పుడు జనగణన తోపాటు కుల గణన కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభతో పాటు లోక్ సభ స్థానాల సంఖ్య కూడా పెరగుతాయని రాజకీయ ఆశావాహులు సంబరపడుతున్నారు.